
India women vs Pakistan Women Asia Cup 2024 : మహిళల ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్ లో దాయాది దేశాలైన భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. శ్రీలంకలోని రాంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆసియా కప్ 2024 లో శుభారంభం చేస్తూ పాకిస్తాన్ పై విజయాన్ని అందుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ అద్భుతమైన ఫామ్ తో తన జోరును ప్రదర్శించింది. ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా గెలిచింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ప్లేయర్లు అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టడంతో పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అమీన్ 25 పరుగులు, తుబా హసన్ 22 పరుగులు, ఫాతిమా సనా 22 పరుగులు చేయడంతో పాక్ 108 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీసుకుంది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
109 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. భారత ఒపెనర్లు మంచి శుభారంభం అందించారు. షఫాలీ వర్మ 40 పరుగులు, స్మృతి మంధాన 45 పరుగులు చేశారు. దయాళన్ హేమలత 14 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చివరలో జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్తాన్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.