భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది.
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
జట్టును గెలిపించడానికి రిచా ఘోష్ (96) ఒంటరి పోరాటం చేసినప్పటికీ , నిరాశ తప్పలేదు. ఆమె క్రీజులో వున్నంత వరకు భారత్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ రిచా ఔట్ అయ్యాక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆ వెంటనే వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో భారత ఓటమి ఖరారైంది. జెమీమా రోడ్రిగ్స్ (44), స్మృతి మంథాన (34) పర్వాలేదనిపించుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 3, జార్జియా వెర్హామ్ 2, అలానా కింగ్, కిమ్ గార్త్ , ఆష్లీన్ గార్డ్‌నర్ తలో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (63), ఎలిస్ పెర్రీ (50)లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరికి తాలియా మెక్‌గ్రాత్ (24), జార్జియా వేర్‌హామ్ (22), అనాబెల్ సదర్లాండ్ (23)లు సహకరించారు. ఇక చివరిలో కిమ్ గార్త్ (11), అలానా కింగ్ (28) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, పూజా వస్త్రాకర్ , శ్రేయాంక పాటిల్ , స్నేహ రాణాలు తలో వికెట్ పడగొట్టారు.