
మాయదారి మహమ్మారి కరోనా ధాటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మిగతా రంగాల మాదిరిగానే క్రీడలపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచే క్రికెట్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి వీల్లేకుండా చేస్తున్న కరోనా.. గత రెండేండ్ల మాదిరిగానే తాజాగా మరో దెబ్బ కొట్టింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా.. త్వరలో విండీస్ తో జరుగబోయే వన్డే సిరీస్ కు ప్రేక్షకులను అనుమతించేది లేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. దీంతో వన్డే సిరీస్ అంతా ఖాళీ స్టేడియంలో.. అంపైర్లు, కామెంటేటర్లు, ఫీల్డర్లే ప్రేక్షకులుగా మ్యాచులు జరుగనున్నాయి.
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వన్డే సిరీస్ లోని మ్యాచులకు ప్రేక్షకులెవరూ రావొద్దని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. భారత్ లో జరుగుతున్న ఈ సిరీస్ ను లైవ్ గా చూద్దామనుకున్న అభిమానులకు నిరాశను మిగిల్చింది.
ట్విట్టర్ వేదికగా జీసీఏ స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 6న టీమిండియా తన 1000వ మ్యాచును ఆడనున్నది. క్రికెట్ చరిత్రలో వెయ్యో వన్డే ఆడిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రలో మిగిలిపోనున్నది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు...’అని పేర్కొంది.
ఇదిలాఉండగా.. వన్డేలకు ఛాన్సు దక్కకపోయినా క్రికెట్ అభిమానులకు డబుల్ వినోదాన్ని పంచే టీ20లలో మాత్రం టీమిండియా ఫ్యాన్స్ కు ఆ అవకాశం దక్కనుంది. వన్డే సిరీస్ అనంతరం విండీస్ జట్టు.. భారత్ తో మూడు టీ20 లు కూడా ఆడనున్నది. ఈ సిరీస్ కు మాత్రం ప్రేక్షకులను అనుమతించే అవకాశముంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగబోయే టీ20 సిరీస్ కు 75 శాతం ప్రేక్షకులను అనుమతించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న ఇరు జట్లు బయో బబుల్ లోకి వెళ్లాయి. ఫిబ్రవరి ఆరు నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. 16 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. గత 20 ఏండ్లుగా విండీస్ భారత్ లో వన్డే సిరీస్ నెగ్గలేదు. ఆ గండాన్ని ఈసారి దాటాలని కీరన్ పొలార్డ్ సేన భావిస్తున్నది. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ ను విండీస్ కైవసం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు పరిమిత ఓవర్లలో భారత కొత్త సారథి రోహిత్ శర్మ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా వన్డేలలో ఇదే తొలి సిరీస్.