India vs Sri Lanka: 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి టాప్ క్లాస్ టీమ్ బ్యాటర్లను గడగడలాడించిన భారత బౌలర్లు, శ్రీలంకపై చెలరేగిపోతున్నారు. 358 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక, 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది..
ఇన్నింగ్స్ మొదటి బంతికి పథుమ్ నిశ్శంకని అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. తన ఓవర్‌లో మొదటి బంతికి దిముత్ కరుణరత్నేని అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఆ తర్వాతి బంతికే సధీర సమరవిక్రమ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే రివ్యూ తీసుకున్న లంకకు అనుకూలంగా ఫలితం దక్కింది..
undefined
అయితే అదే ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సమరవిక్రమ. 3 ఓవర్లు ముగిసే సమయానికి 3 పరుగులు మాత్రమే చేసి, 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 10 బంతులు ఆడిన కుసాల్ మెండిస్‌ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 24 బంతులాడి 1 పరుగు చేసిన అసలంకను అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఆ తర్వాతి బంతికి హేమంతని పెవిలియన్‌కి చేర్చాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేసింది శ్రీలంక..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ రెండో బంతికే అవుటైనా శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో రాణించారు.
ఇన్నింగ్స్ తొలి బంతికి ఫోర్ బాదిన రోహిత్, రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, శుబ్‌మ్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ, 9 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌లను లంక ఫీల్డర్లు జారవిడిచారు. ఆ తర్వాత లంక ప్లేయర్లకు అవకాశం ఇవ్వని ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు..
92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మధుశంక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా మధుశంక బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
19 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నాలుగో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు.
56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 10 ఓవర్లలో 80 పరుగులు ఇచ్చిన దిల్షాన్ మధుశంక, రోహిత్, విరాట్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య వంటి టాప్ క్లాస్ 5 వికెట్లను పడగొట్టాడు.
2 పరుగులు చేసిన మహ్మద్ షమీ, ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.