India vs Sri Lanka: 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు..
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ రెండో బంతికే అవుటైనా శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో రాణించారు.
ఇన్నింగ్స్ తొలి బంతికి ఫోర్ బాదిన రోహిత్, రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, శుబ్‌మ్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ, 9 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌లను లంక ఫీల్డర్లు జారవిడిచారు. ఆ తర్వాత లంక ప్లేయర్లకు అవకాశం ఇవ్వని ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు..
undefined
92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మధుశంక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా మధుశంక బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
19 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నాలుగో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు.
56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 10 ఓవర్లలో 80 పరుగులు ఇచ్చిన దిల్షాన్ మధుశంక, రోహిత్, విరాట్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య వంటి టాప్ క్లాస్ 5 వికెట్లను పడగొట్టాడు.
2 పరుగులు చేసిన మహ్మద్ షమీ, ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.