India Vs New Zealand: పని మొదలుపెట్టిన రాహుల్ ద్రావిడ్.. ప్రధానంగా ఆ సమస్య మీదే ఫోకస్..

By team teluguFirst Published Nov 10, 2021, 6:42 PM IST
Highlights

Rahul Dravid: కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ రాగానే పని మొదలుపెట్టేశాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో..  టీ20 కొత్త సారథి రోహిత్ శర్మ సారథ్యంలో జరుగుతున్న ఈ సిరీస్ కు ముందే ద్రావిడ్ తన పనిని ప్రారంభించాడట. టీ20 ప్రపంచకప్ లో భారత్ వైఫల్యానికి ప్రధాన కారణంగా భావిస్తున్న సమస్యపై ద్రావిడ్ దృష్టి సారించాడని సమాచారం. 

భారత క్రికెట్ కు ఐదేండ్ల పాటు హెడ్ కోచ్ గా సేవలందించిన రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని రాహుల్ ద్రావిడ్ భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో టీ20, రెండు టెస్టుల సిరీస్ కు బీసీసీఐ ఆయనను తాత్కాలిక కోచ్ గా నియమించింది. భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన టీమిండియా.. సూపర్-12 కూడా దాటకుండానే నిష్క్రమించడం.. కివీస్ తో సిరీస్ కు ముందు భారత సీనియర్లలో పలువురికి విశ్రాంతినివ్వడంతో కొత్తగా ఎంపిక చేసిన జట్టులో  అత్యధికులు కొత్త ముఖాలే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. 

ఈ మేరకు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రాగానే పని మొదలుపెట్టేశాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో..  టీ20 కొత్త సారథి రోహిత్ శర్మ సారథ్యంలో జరుగుతున్న ఈ సిరీస్ కు ముందే ద్రావిడ్ తన పనిని ప్రారంభించాడట.  టీ20 ప్రపంచకప్ లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్ లతో ఓడిపోయిన తర్వాత తీరిక లేని క్రికెటే కారణమని వాదనలు వినిపించాయి. టీమిండియా బౌలర్ బుమ్రాతో పాటు బౌలింగ్ కోచ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పుడు ఇదే ఇష్యూను ద్రావిడ్ ఎలా పరిష్కరిస్తాడన్నది కీలకాంశం. 

వచ్చే ప్రపంచకప్ కు ముందు ఈ సమస్యను అధిగమించి జట్టును అన్ని విధాలుగా సన్నద్ధంగా చేసేందుకు గాను ఆటగాళ్లకు మెగా టోర్నీల ముందు విశ్రాంతినివ్వాలని కొంతమంది సూచిస్తుండగా.. మరికొంతమందేమో రొటేషన్ పాలసీని పాటించాలని సలహా ఇస్తున్నారు. ఆటగాళ్ల అలసట సమస్యను ద్రావిడ్.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ముందుంచాడట.  ఈ నెల మొదట్లో.. సీఏసీ తో సమావేశమైన ద్రావిడ్.. ఆ సభ్యుల ముందు ఈ సమస్యను లేవనెత్తి.. దానికి గల పరిష్కారాలను చూపినట్టు పలు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే విషయమై ద్రావిడ్.. పలువురు ఆటగాళ్లతో కూడా మాట్లాడినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఫార్మాట్, సిరీస్, టోర్నీల ప్రాముఖ్యతను బట్టి ఏ ఆటగాళ్లను ఎంపిక చేయాలి..? ఎవరితో ఎన్ని మ్యాచులు ఆడించాలి..? ఎవరికి విశ్రాంతినివ్వాలి..?  అనే విషయాలను ద్రావిడ్ సీఏసీ తో చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకే  వచ్చే వారం మొదలుకాబోయే న్యూజిలాండ్ తో సిరీస్ లో విరాట్ కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. రోహిత్ కూడా విశ్రాంతి కోరుకున్నా.. సారథిగా ఎంపిక చేయడంతో అతడికి అవకాశం లేకుండా పోయింది. రిషభ్ పంత్ ను తుది జట్టులోకి ఎంపిక చేసినా.. బ్యాకప్ గా మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను కూడా తీసుకొచ్చారు.

కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజా, పంత్ వంటి వాళ్లు గత ఆరు నెలలుగా విరామం లేని క్రికెట్ ఆడుతున్నారు.  ఆ ప్రభావం ప్రపంచకప్ మీద కూడా పడింది. అయితే ఆటగాళ్ల అలసట సమస్యకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ. ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఒక ఆటగాడు ఎంత క్రికెట్ ఆడుతున్నాడనేదాన్నిబట్టి ఏ ఆటగాడికి విశ్రాంతినివ్వాలో బీసీసీఐ నిర్ణయిస్తుంది. అలసట సమస్య గురించి మాకు తెలుసు. ఒకవేళ విశ్రాంతి తీసుకున్న ఆటగాడి స్థానంలో కొత్త ఆటగాడు భర్తీ చేసినప్పటికీ అతడు తుది జట్టులోకి  తిరిగి వస్తాడు’ అని తెలిపాడు. 

click me!