క్రికెట్ అభిమానులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ కప్ 2023 లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీస్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తూ చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
విశాఖపట్నం : ఐసిపి వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో మరో అద్భుత మ్యాచ్ కు సమయం ఆసన్నమవుతోంది. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే ఎరగకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. ఆరంభంతో అదరగొట్టి... చివర్లో తడబడి ఎట్టకేటకు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది న్యూజిలాండ్. ఇలా లీగ్ దశ ముగియడంతో సెమీ ఫైనల్లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సిద్దమయ్యాయి. రేపు(బుధవారం) ముంబై వాంఖడే స్టేడియంలో ఇరుజట్లు తలపడనున్నాయి.
ఇప్పటివరకు ఆడిన అన్ని లీగ్ మ్యాచుల్లో టీమిండియా ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. మిగతా జట్లతో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్ తో మ్యాచ్ అయినా ఉత్కంఠభరితంగా సాగుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ కివీస్ ను కూడా సునాయాసంగా ఓడించింది టీమిండియా. ఇక సెమీస్ లో అయినా ఇండియా, న్యూజిలాండ్ మధ్య హోరాహోరీ పోరు వుంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు కాలేజీలకు డుమ్మాలు, ఆఫీసులకు సెలవులు పెట్టేందుకు ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూడాలనుకుంటున్న అభిమానులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
undefined
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పట్టణాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటుచేస్తోంది ఏసిఏ. విశాఖపట్నంలో అయితే హాయిగా సముద్రపు ఒడ్డున కూర్చుని సమఉజ్జీల మధ్య సమరాన్ని చూసేలా ఏర్పాట్లుచేస్తోంది ఏసిఏ. ఆర్కే బీచ్ లోని కాళీమాత గుడి ఎదురుగా బిగ్ స్క్రీన్ ఏర్పాటుచేసి ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ ప్రసారం చేయనున్నారు.
Read More ICC World CUP 2023 : టీమిండియాకు అద్భుత అవకాశం... కివీస్ పై రివేంజ్ తీర్చుకునేందుకు రెడీనా..!
ఇక విజయవాడలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేస్తోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. రేపటి సెమీస్ మ్యాచ్ ను అందరూ ఒకేచోట కూర్చునిచూసేలా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో బిగ్ స్క్రీన్ ఏర్పాటుచేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ బిగ్ స్క్రీన్ ఏర్పాటుచేస్తున్నారు. కడప పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసే బిగ్ స్క్రీన్లలో ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఇలా రాష్ట్రంలోని మూడు పట్టణాల్లో దాదాపు 10వేల మంది ఒకేచోట కూర్చుని ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చూసే ఏర్పాట్లు చేస్తోంది ఏసిఏ. ఇంత చేస్తుంది కాబట్టి ప్రవేశానికి ఏమైనా టికెట్ వుంటుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు... ఉచితంగానే బిగ్ స్క్రీన్లలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ వీక్షించవచ్చు.