India vs England : సచిన్, ద్రావిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన జో రూట్

Published : Jun 16, 2025, 09:58 PM IST
India vs England Joe Root set multiple records after scored century in edgbaston test spb

సారాంశం

India vs England : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను టార్గెట్ చేశాడు.

India vs England: ఇంగ్లాండ్ టీమ్ భారత జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ కీలక సిరీస్‌లో దృష్టంతా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పైనే ఉంది. 2020వ దశకంలో జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు భారత్ vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో లెజెండరీ ప్లేయర్ల రికార్డులను టార్గెట్ చేశాడు.

ఈ నెల 20న ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో జో రూట్ ఇద్దరు భారత దిగ్గజాల రికార్డులపై కన్నేసాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) రికార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే, భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటుతో ఉన్న రాహుల్ ద్రవిడ్ (60.93) రికార్డును కూడా జో రూట్ బద్దలు కొట్టాలనుకుంటున్నాడు.

రికీ పాంటింగ్‌ను అధిగమించనున్న జోరూట్

ప్రస్తుతం జో రూట్ 153 టెస్టుల్లో 13,006 పరుగులు చేశాడు. అతడి సగటు 50.80 గా ఉంది. ఇందులో 36 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 262 పరుగులు. ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ టాప్ లో ఉన్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో అత్యధిక పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇంకా 373 పరుగులు చేస్తే జోరూట్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (13,378 పరుగులు)ను అధిగమించవచ్చు. దీంతో అతను టెస్ట్ చరిత్రలో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

భారత్‌పై జో రూట్ కు అద్భుతమైన రికార్డులు

భారత జట్టుపై జో రూట్ ఇప్పటివరకు 30 టెస్టుల్లో 2,846 పరుగులు చేశాడు. సగటు 58.08 గా ఉంది. ఇందులో 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ పై అతని వ్యక్తిగత బెస్ట్ స్కోర్ 218 పరుగులు. స్వదేశంలో భారత్‌పై మరింత ప్రభావవంతంగా రూట్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌లో భారత్‌పై అతని సగటు 74.95 గా ఉంది. 15 టెస్టుల్లో 1,574 పరుగులు చేయగా, ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 180* పరుగులు.

ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన జోరూట్

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ల్లో కనీసం 1,500 పరుగులు చేసిన బ్యాటర్లలో ద్రవిడ్ సగటు అత్యధికంగా 60.93 ఉంది. ఆ తర్వాత జో రూట్ సగటు 58.55గా ఉంది. ఒకటి లేదా రెండు సెంచరీలు కొడితే జో రూట్ ఈ భారత దిగ్గజ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జో రూట్ కొత్త మైలురాయి

గత WTC సైకిల్ లో జో రూట్ 22 టెస్టుల్లో 1,968 పరుగులు చేశాడు. సగటు 54.66 గా ఉంది. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 5,543 పరుగులతో జో రూట్ టాప్ లో ఉన్నాడు. 6,000 పరుగుల మార్కును అందుకునే మొదటి ప్లేయర్ గా రికార్డు సాధించే అవకాశముంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ జూన్ 20న లీడ్స్‌లో ప్రారంభం కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!