ఇండియా- ఇంగ్లాండ్ మధ్య గౌహతిలో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ వర్షంతో రద్దు... తిరువనంతపురంలో జరగాల్సిన ఆస్ట్రేలియా - నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా సేమ్ రిజల్ట్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచులకు వరుణ గండం వెంటాడుతోంది. శుక్రవారం తిరువనంతపురంలో సౌతాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దు అయ్యింది.. శనివారం ఇండియా- ఇంగ్లాండ్ మధ్య గౌహతిలో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దు అయ్యింది. టాస్ తర్వాత సరిగ్గా ఆట ప్రారంభమయ్యే సమయానికి కుండపోత వర్షం కురిసింది. 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్, సాయంత్రం 5:30 దాటినా ప్రారంభం కాలేదు..
3 గంటల 30 నిమిసాలకు కాసేపు వర్షం బ్రేక్ ఇచ్చినా, అంపైర్లు పిచ్‌ని పరీశీలించే సమయానికి మళ్లీ వర్షం కురిసింది. దీంతో ఇక ఆట జరిగే అవకాశం లేదని నిర్ణయించుకున్న ఇరు జట్లు, స్టేడియాన్ని వీడి హోటళ్లకు చేరుకున్నాయి.. అధికారికంగా సాయంత్రం 7:30 వరకూ వాతావరణాన్ని సమీక్షిస్తూ, రద్దు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ లోగా వర్షం తగ్గినా, చిత్తడిగా మారిన అవుట్ ఫీల్డ్ ఆరేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రాక్టీస్ మ్యాచ్ జరిగే అవకాశం లేదు. ఈ కారణంగానే స్టేడియంలో ఎదురుచూస్తూ కూర్చోకుండా హోటల్స్‌కి వెళ్లిపోయాయి రెండు జట్లు..
అలాగే తిరువనంతపురంలో జరగాల్సిన ఆస్ట్రేలియా - నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. తిరువనంతపురంలో కేవలం వార్మప్ మ్యాచులను మాత్రమే షెడ్యూల్ చేసింది ఐసీసీ. కాబట్టి ఇక్కడ వరల్డ్ కప్ ప్రధాన మ్యాచులు జరగడం లేదు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, హైదరాబాద్ వేదికల్లో వన్డే వరల్డ్ కప్ 2023 పోటీలు జరగబోతున్నాయి..
ఇందులో హైదరాబాద్‌లో మూడే మ్యాచులు జరగబోతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచులకు కూడా ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ని తిరువనంతపురంలో అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తోనే ఆడాల్సి ఉంది. ఇక్కడ జరగాల్సిన మొదటి రెండు వార్మప్ మ్యాచులు రద్దు కావడంతో ఈ మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందా? అనేది అనుమానమే. ఇంగ్లాండ్, గౌహతిలోనే అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది..