గౌహతిలో జరగాల్సిన ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా వరుణుడి అంతరాయం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ హడావుడి మొదలైంది. వార్మప్ మ్యాచులు కూడా మొదలైపోయాయి. అయితే వార్మప్ మ్యాచులను కూడా వరుణుడు వదలడం లేదు. తిరువనంతపురంలో సౌతాఫ్రికా - ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది. ఎడతెడపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ప్లేయర్లకు నెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా దక్కలేదు..
తాజాగా గౌహతిలో జరగాల్సిన ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా వరుణుడి అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మరో 10 నిమిషాల్లో ఆట ఆరంభం అవ్వాల్సి ఉండగా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
undefined
తిరువనంతపురంలో ఆస్ట్రేలియా- నెదర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ టాస్ కూడా వేయలేదు. నిన్న ఇక్కడే జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందా? అనేది అనుమానంగా మారింది..
వార్మప్ మ్యాచుల సంగతే ఇలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచుల సంగతేంటో? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న వానాకాలం ముగియాలి. కానీ మరో వారం, 15 రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌కి కూడా వర్షం అడ్డు తగిలింది. అయితే కాసేపు కురిసిన వాన, మళ్లీ ఆగిపోవడంతో ఆట సజావుగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 345 పరుగుల భారీ స్కోరు చేసింది..
మహ్మద్ రిజ్వాన్ 103, బాబర్ ఆజమ్ 80, సౌద్ షకీల్ 75 పరుగులు చేశారు. అయితే ఈ భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డివాన్ కాన్వే గోల్డెన్ డకౌట్ అయినా రచిన్ రవీంద్ర 97, కేన్ విలియంసన్ 54, డార్ల్ మిచెల్ 59, మార్క్ చాప్‌మన్ 65, జేమ్స్ నీషమ్ 33 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.
గౌహతిలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పథుమ్ నిశ్శంక 68, కుసాల్ పెరేరా 34, ధనంజయ డి సిల్వ 55 పరుగులు చేశారు.
ఈ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్. తన్జీద్ హసన్ 84, లిట్టన్ దాస్ 61, మెహిదీ హసన్ మిరాజ్ 67, ముస్తాఫికర్ రహీం 35 పరుగులు చేశారు.