
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. గురువారం ప్రత్యేక విమానంలో జోహన్నస్బర్గ్ కు వెళ్లిన టీమిండియా.. శుక్రవారం ఉదయమే అక్కడ ల్యాండ్ అయింది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు ఆటగాళ్లను కూడా డిస్ట్రబ్డ్ చేసి ఉంటాయని అందరూ భావిస్తుండగా... క్రికెటర్లు మాత్రం జోష్ గా కనిపించారు. దక్షిణాఫ్రికాకు వెళ్లేముందు ప్రెస్ కాన్ఫరెన్స్ తో భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు తెరలేపిన విరాట్ కోహ్లీ కూడా చాలా హుషారుగా కనిపించాడు. అప్పుడే నిద్ర లేచినట్టున్న టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను ఆటపట్టించాడు.
విమానంలో భారత ఆటగాళ్ల ప్రయాణం ఎలా సాగిందనే విషయమై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. శుక్రవారం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఛతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ లు ఉల్లాసంగా కనిపించారు.
ఇక కోహ్లీ ఇషాంత్ దగ్గరికెళ్లి.. ‘ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన వెంట అవసరమైన సూట్ కేసును కచ్చితంగా ఉండాలి..’ అని టీజ్ చేస్తుండగా అతడు కల్పించుకుని.. ‘పొద్దుపొద్దున నీకు నేనే దొరికానా... ఇంత ఉదయం ఇవన్నీ వద్దు...’ అంటూ పంచ్ ఇచ్చాడు.
అంతేగాక శ్రేయస్ అయ్యర్ ఏదో పాటకు డాన్స్ చేస్తుండటం.. విమానంలో నుంచి రిషభ్ పంత్ కిందికి ఆసక్తిగా చూస్తుండటం.. దక్షిణాఫ్రికా లో దిగగానే అక్కడ పలువురు మహిళలు భారత ఆటగాళ్లకు స్వాగతం చెబుతూ డాన్సులు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఈనెల 26 నుంచి సెంచూరీయన్ వేదికగా జరుగబోయే తొలి టెస్టుతో సిరీస్ వేట మొదలుపెట్టబోతున్నది. టెస్టులకు పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. అతడు వన్డే సిరీస్ ప్రారంభానికల్లా దక్షిణాఫ్రికా చేరుకుంటాడు.