బీసీసీఐకి కాసుల పంట.. ఇప్పటికే 12 వేల కోట్లు.. కొద్దిరోజుల్లో మరో 40.. దాదా స్కెచ్ మాములుగా లేదుగా...

Published : Dec 17, 2021, 01:47 PM ISTUpdated : Feb 03, 2022, 07:56 PM IST
బీసీసీఐకి కాసుల పంట.. ఇప్పటికే 12 వేల కోట్లు.. కొద్దిరోజుల్లో మరో 40.. దాదా స్కెచ్ మాములుగా లేదుగా...

సారాంశం

IPL Media Rights: ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరింత సుసంపన్నం కానుంది. దేశంలోని చిన్న  రాష్ట్రాల బడ్జెట్ కన్నా బీసీసీఐ ఆదాయమే ఎక్కువ కాబోతున్నది..? 

ప్రపంచ క్రికెట్ ను కనుసైగతో శాసిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరింత సుసంపన్నం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా కోటానుకోట్ల ఆదాయం పొందుతున్న బీసీసీఐ.. దానిని మరింత  పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. తాజాగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు  గమనిస్తే ఈ విషయం నిజమనిపించకమానదు. ఇటీవలే ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్ల రాకతో బీసీసీఐకి రూ. 12 వేల కోట్ల ఆదాయం  సమకూరింది. ఇక  తాజాగా ఐపీఎల్  మీడియా  హక్కుల విషయంలో  ఏకంగా రూ. 40 వేల కోట్లను సమకూర్చుకునేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 

ఈ మేరకు దాదా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘రెండు కొత్త ఫ్రాంచైజీల రాకతో  ఇప్పటికే బోర్డుకు 12 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఐపీఎల్ మీడియా హక్కుల  ద్వారా మరో 40 వేల కోట్ల రూపాయలు సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నాం.. త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. 

వాటి ద్వారా రూ. 12,725 కోట్లు..  

ఐపీఎల్ 2022 లో రెండు కొత్త జట్లు (లక్నో, అహ్మదాబాద్) రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన కొత్త ఫ్రాంచైజీల బిడ్ల ప్రక్రియలో ఆర్పీఎస్జీ గ్రూప్.. లక్నోను దక్కంచుకోగా సీవీసీ అహ్మదాబాద్ ను  పొందింది. లక్నో కోసం ఆర్పీఎస్జీ.. రూ. 7,090 కోట్లు, అహ్మదాబాద్ కోసం సీవీసీ.. రూ. 5,625 కోట్లకు టెండర్ దాఖలు చేశాయి.  ఇవి మొత్తంగా రూ. 12,725 కోట్లు. 

మూడు రెట్లు అధికం.. 

వీటితో పాటు మీడియా హక్కుల అమ్మకం విషయంలో గత ఐదేండ్లుగా (2018-2022)  బీసీసీఐకి రూ. 16,347 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. త్వరలోనే 2023-2027 కు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.  మీడియా  హక్కుల అమ్మకంలో బీసీసీఐకి రూ. 40 వేల కోట్ల రూపాయలు సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నామని స్వయంగా బీసీసీఐ చీఫ్ చెబుతుండటంతో..  ఈ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే  బోర్డు చేతిలో రూ. 50 వేల కోట్లు  ఉండనున్నాయి.  గంగూలీ చెప్పినట్టు.. మీడియా హక్కుల  రూపంలో రూ.  40 వేల కోట్లు వస్తే..  ఆ విలువ గతంలో కంటే మూడు రెట్లు పెరిగినట్టే  లెక్క. 

‘భారత క్రికెట్ కు రూ. 50 వేల కోట్లు.. మన ఆటను మరో మెట్టు ఎక్కించేందుకు బీసీసీఐ కృషి చేస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నది...’ అని గంగూలీ చెప్పాడు. 

స్టార్ ఇండియా నే కాదు.. పోటీలో బడా కార్పొరేట్లు : 

గుడ్లు పెట్టే బంగారు బాతును ఎవరు వదులుకుంటారు. ఐపీఎల్ అనే క్యాష్ రిచ్ లీగ్  సంపాదించుకునే వారికి ఒక  బహిరంగ మార్కెట్ లా మారింది. దాని నుంచి వస్తున్న ఆదాయంతో బడా కార్పొరేట్లు సైతం దాని మీద దృష్టి సారించారు. ప్రసార హక్కుల విషయంలో  గత ఐదేండ్లుగా స్టార్ ఇండియాతో  బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకోగా.. అది వచ్చే ఏడాది ముగియనుంది. కొత్త  సైకిల్ కు టెండర్లను పిలిచే ప్రక్రియకు బీసీసీఐ సిద్ధమవుతున్న తరుణంలో.. స్టార్ ఇండియా ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు.. సోనీ కూడా గట్టిగానే ప్రయత్నాలను చేస్తున్నది. 

ఈ రెండిటితో పాటు భారత్ లో ఏ రంగంలో అయినా తన పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ కూడా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నది. ఆ సంస్థ కు చెందిన వయాకామ్ కూడా ఈసారి మీడియా టెండర్లలో పాల్గొనాలని చూస్తున్నది. ఇవే గాక అంతర్జాతీయంగా ఈ కామర్స్ లో దూసుకుపోతున్న అమెజాన్ కూడా బీసీసీఐ మీడియా టెండర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.  ఈ నేపథ్యంలో బడా కార్పొరేట్ల మధ్య  ప్రసార హక్కుల యుద్ధం.. బీసీసీఐకి మరింత కాసులు కురిపంచడం ఖాయంగా కనిపిస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?