
వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మిడిలార్డర్ తో పాటు ఆఖర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీ త భారత్ కు చిరస్మరణీయ విజయం దక్కింది. టెయిలెండర్ల సాయంతో అక్షర్ పటేల్.. లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలుండగానే ఛేదించాడు. దీంతో విండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో వన్డేతో పాటు సిరీస్ ను కూడా అందించాడు. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
భారీ లక్ష్య ఛేదనలో భారత్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. తొలి వన్డేలో తృటిలో సెంచరీ కోల్పోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ (31 బంతుల్లో 13) ఈసారి విఫలమయ్యాడు. 10వ ఓవర్లో భారత్ ధావన్ వికెట్ కోల్పోయింది.
అప్పటికే దూకుడుగా ఆడుతున్న శుభమన్ గిల్ (49 బంతుల్లో 43, 5 ఫోర్లు) కూడా మేయర్స్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరికొద్దిసేపటికే భారత్ కు మరో షాక్ తగిలింది. సూర్యకుమార్ యాదవ్ (9) ను కూడా మేయర్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో సంజూ శాంసన్ (51 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో జతకలిసిన శ్రేయాస్ అయ్యర్ (71 బంతుల్లో 63, 4 ఫోర్లు, 1 సిక్సర్).. సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు 20 ఓవర్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కూడా శాంసన్-అయ్యర్ వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడటంతో స్కోరుబోర్డు మందగించింది. గతి తప్పిన బంతులను బౌండరీకి తరలించిన ఇద్దరూ.. ప్రధానంగా సింగిల్స్ మీదే దృష్టి పెట్టారు.
స్కోరు మరీ నెమ్మదిగా సాగుతున్న తరుణంలో శ్రేయాస్ అయ్యర్ రూట్ మార్చాడు. మేయర్స్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ బాదిన అతడు.. ఆ తర్వాత కూడా స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి ఈ సిరీస్ లో వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత బంతిని అతడు స్టాండ్స్ లోకి పంపాడు. చివరి బంతిని సామ్సన్ ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. దీంతో భారత్ 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే అర్థ సెంచరీ అయ్యాక అయ్యర్.. అల్జారీ జోసెఫ్ వేసిన 32 ఓవర్ ఆఖరిబంతికి ఎల్బీడబ్ల్యూ అయి వెనుదిరిగాడు. దీంతో 99 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అయ్యర్ ఔటయ్యాక దీపక్ హుడా (36 బంతుల్లో 33, 2 ఫోర్లు) తో కలిసి భారత్ ను ముందుకునడిపించిన శాంసన్ జేడన్ సీల్స్ వేసిన 37.2 వ ఓవర్లో ఫోర్ కొట్టి ఫిఫ్టీ సాధించాడు. కానీ తర్వాత ఓవర్లోనే రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ ను గెలిపించాల్సిన బాధ్యత దీపక్ హుడా మీద పడింది. అప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో ఒత్తిడి కూడా పెరిగింది.
చివరి పది ఓవర్లలో..
40 ఓవర్లకు భారత స్కోరు 212-5. దీపక్ హుడా, అక్షర్ పటేల్ లు అప్పట్నుంచి దూకుడుగా ఆడారు. అకీల్ హోసెన్ వేసిన 41వ ఓవర్లో ఐదో బంతిని సిక్సర్ గా బాదిన అక్షర్.. ఆ తర్వాత ఓవర్లో షెపర్డ్ బౌలింగ్ లో కూడా అదే రిపీట్ చేశాడు. మరో ఎండ్ లో దీపక్ హుడా కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 45 ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడిన హుడా.. వాల్ష్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ (3) విఫలమైనా అక్షర్ మాత్రం పట్టువిడవలేదు. రొమారియా షెఫర్డ్ వేసిన 47వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదడంతో అక్షర్ వన్డేలలో తొలి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 27 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అదే ఓవర్లో మూడో బంతిని అవేశ్ ఖాన్ బౌండరీగా మలిచాడు. మొత్తంగా ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి.
ఇక ఆఖరి 2 ఓవర్లలో 15 పరుగులు అవసరమనగా జేడన్ సీల్స్ వేసిన 49వ ఓవర్లో 7 పరుగులొచ్చాయి. ఆ ఓవర్లో చివరి బంతికి అవేశ్ ఖాన్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్ లో 8 పరుగులు అవసరమనగా.. మేయర్స్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాదిన అక్షర్ భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. విండీస్ జట్టులో ఓపెనర్ షాయి హోప్ (115), నికోలస్ పూరన్ (74), కైల్ మేయర్స్ (39) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు.