వెస్టిండీస్‌తో సిరీస్‌లో మార్పులు చేసే ఆలోచనలో బీసీసీఐ... ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో...

By Chinthakindhi RamuFirst Published Jan 7, 2022, 1:44 PM IST
Highlights

ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనున్న టీమిండియా... ఆరు వేదికల్లో మ్యాచులు నిర్వహించేందుకు షెడ్యూల్... ఒమిక్రాన్ కేసుల ప్రభావంతో బీసీసీఐ ప్లాన్‌లో మార్పులు...

క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి కరోనా భూతం కలవరబెడుతోంది. 2020 ఏడాదిలో ముప్పావు శాతం క్రికెట్ టోర్నీలను హరించిన కరోనా రక్కసి కారణంగానే అనేక టోర్నీలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ నెలలో జరిగిన ఇంగ్లాండ్, ఇండియా టూర్‌లో ఐదో టెస్టు అర్ధాంతరంగా వాయిదా పడడానికి కూడా కరోనా కేసులే కారణం...

అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో, అసిస్టింట్ ఫిజియో... కరోనా పాజిటివ్‌గా తేలడంతో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు ఆరంభానికి ముందు అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది భారత జట్టు...

కరోనా థర్డ్ వేవ్ కారణంగా సౌతాఫ్రికా టూర్‌ కూడా అనుకున్న షెడ్యూల్ కంటే వారం ఆలస్యంగా ప్రారంభమైంది. అదీకాకుండా ఈ టూర్‌లో ఆడాల్సిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌‌ను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి బీసీసీఐ, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. తాజాగా వచ్చే నెలలో జరగాల్సిన వెస్టిండీస్, భారత్ సిరీస్‌పైన కూడా కరోనా ప్రభావం పడింది...

జనవరి 23న జరిగే ఆఖరి, మూడో వన్డేతో సౌతాఫ్రికా టూర్‌ను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చే భారత జట్టు... ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో కలిసి మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనుంది...

ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో మొదటి వన్డే, ఆ తర్వాత 9న జైపూర్‌లో రెండో వన్డే, కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడో వన్డే జరగాల్సి ఉంది. ఆ తర్వాత కోటక్‌లో మొదటి టీ20 మ్యాచ్, వైజాగ్‌లో రెండో టీ20 మ్యాచ్, తిరువనంతపురంలో మూడో టీ20 జరగాల్సి ఉంది...

అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వెస్టిండీస్ సిరీస్‌ని ఆరు వేదికల్లో కాకుండా ఒకటి లేదా రెండు వేదికల్లో కట్టుదిట్టమైన బయో బబుల్ జోన్‌లో నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. 

దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని మొతేరాలో వన్డే సిరీస్, ఆ తర్వాత కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట బీసీసీఐ...

మొదట ఈ మ్యాచులన్నింటికీ ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ భావించినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలయ్యే పని కాదు. మూసి ఉంచిన ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరంగా ఉన్న భారత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు...

వివిధ కారణాల వల్ల టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఆడుతుంటే చూసే అవకాశం దొరకలేదు. విండీస్ టూర్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొట్టమొదటిసారి విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది. 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటే... టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్, సఫారీ టూర్‌కి దూరమైన విషయం తెలిసిందే...

click me!