The Ashes: నువ్వు నన్ను ఎలా పడితే అలా వాడుకున్నావు.. ఇంగ్లాండ్ మాజీ సారథి కుక్ పై మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు

Published : Jan 07, 2022, 11:49 AM IST
The Ashes: నువ్వు నన్ను ఎలా పడితే అలా వాడుకున్నావు.. ఇంగ్లాండ్ మాజీ సారథి కుక్ పై మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Alastair Cook Vs Moeen Ali: యాషెస్  సిరీస్ లో భాగంగా నాలుగో  టెస్టుపై విశ్లేషణ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న  అలెస్టర్ కుక్, మొయిన్ అలీలు ఒకరిపై ఒకరు సంచలన  వ్యాఖ్యలు చేసుకున్నారు. అలెస్టర్ కుక్.. తనను ఎక్కడపడితే అక్కడే బ్యాటింగ్ చేయమనేవాడని అలీ వ్యాఖ్యానించాడు. 

ఇంగ్లాండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్.. ఆ జట్టు మాజీ టెస్టు ఆటగాడు, ప్రస్తుతం సీఎస్కే తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ మొయిన్ అలీ మధ్య పలు విషయాలపై ఆసక్తికర చర్చ జరిగింది. యాషెస్  సిరీస్ లో భాగంగా నాలుగో  టెస్టుపై విశ్లేషణ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు సంచలన  వ్యాఖ్యలు చేసుకున్నారు. అలెస్టర్ కుక్.. తనను ఎక్కడపడితే అక్కడే బ్యాటింగ్ చేయమనేవాడని, కానీ ప్రస్తుతం సారథి రూట్ అలాంటివాడు కాదని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ అలీ చెప్పాడు. రూట్.. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడని అలీ తెలిపాడు. ఒకదశలో ఇద్దరు ఆటగాళ్లు వాగ్వాదానికి దిగినంత పనిచేశారు. 

యాషెస్  సీరీస్ కోల్పోవడంతో జో రూట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోను హోస్ట్ చేస్తున్న వ్యక్తి కుక్,  రూట్ మధ్య వ్యత్యాసాలను  గురించి చెప్పాలని అలీని ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ అలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 

కుక్ ఎదురుగా ఉండగానే.. ‘రూటీ (జో రూట్) సహచర ఆటగాళ్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతాడు..’ అని అనగానే అక్కడే ఉన్న  కుక్.. ‘అంటే నువ్వు నా కెప్టెన్సీని విమర్శిస్తున్నావా..?’ అని ప్రశ్నించాడు. దీనికి అలీ బదులిస్తూ.. ‘అవును.. అలాగే అనుకోవచ్చు. ఇద్దరి (రూట్, కుక్) మధ్య చాలా తేడాలున్నాయి. కుకీ (కుక్) సారథ్యంలో నేను బాగా  బ్యాటింగ్ చేశాను. అదే రూట్ సారథ్యంలో చక్కగా బౌలింగ్ చేశాను..’ అని అన్నాడు. 

దీంతో కాస్త అసహనానికి లోనైన కుక్.. ‘నువ్వుు నన్ను విమర్శించవచ్చు.. కానీ  నేను నిన్ను ఎప్పుడూ జట్టు నుంచి తప్పించలేదు. అదే రూట్ ఎన్నిసార్లు డ్రాప్ చేశాడు..?’ అంటూ ఫైర్ అయ్యాడు. దీనికి అలీ కూడా అదే విధంగా బదులిస్తూ.. ‘అవును.. నిజమే కానీ నా  అంతర్జాతీయ కెరీర్ లో  మొదటి ఏడాదిలో నెంబర్ 1 నుంచి మొదలుకుని 9 వ స్థానం వరకు.. ఎక్కడ పడితే అక్కడ ఆడించావు. అది మరిచిపోయావా..?’ అని కౌంటర్ ఇచ్చాడు. 

దీంతో కాస్త తగ్గిన కుక్.. ‘నేను నీకు చాలాసార్లు అవకాశాలిచ్చాను. నువ్వు ఎప్పుడు టెయిలెండర్ గా దిగాలి..? ఎప్పుడు ఓపెనింగ్ చేయాలి..? ఏ స్థానానికి నువ్వు కరెక్ట్ గా సరిపోతావు...? అన్నది నాకు తెలుసు. అందుకే జట్టు అవసరాల రీత్యా  నిన్ను అలా వాడాను..’ అని అన్నాడు. ఆపై అలీ అందుకుంటూ.. ‘నేనేమన్నానో నువ్వు అర్థం చేసుకోవాలి. రూటీ తన తోటి ఆటగాళ్లతో కలిసిపోతాడన్నది నా అభిప్రాయం. అంతమాత్రానా కుకీ అలాంటి వాడు కాదు అని నేను చెప్పలేదు కదా...’ అని  చెప్పాడు. దీనికి కుక్ మాత్రం.. ‘ఏదైతేనేం గానీ నీ మాటల్ని మాత్రం నేను తేలికగా తీసుకోను..’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

దీంతో పాటు  ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. భవిష్యత్తులో కోచ్ గా పనికిరాడని కూడా అలీ సంచలన  కామెంట్స్ చేశాడు. అతడు కోచ్ గా రావాలని చాలా మంది కోరుకుంటున్నారని, అయితే కోచ్ గా కంటే  మోర్గాన్  జట్టుకు మెంటార్ గా ఉంటే భావుంటుందని అలీ అభిప్రాయపడ్డాడు. అయితే అతడు ఉత్తమ కోచ్ కాలేడని తాను అనడం లేదని, మోర్గాన్ ను ఆ స్థానంలో తాను చూడలేనని అనుకుంటున్నానని మాత్రమే  చెప్పానని స్పష్టత ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు