ICC New Rules: ఇక నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అంతే.. టీ20లలో ఐసీసీ కొత్త రూల్స్.. ఈ నెల నుంచే అమలు

By Srinivas MFirst Published Jan 7, 2022, 12:33 PM IST
Highlights

ICC New Rules In T20I: టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. స్లో ఓవర్ రేట్ కు మ్యాచ్ ఫీజులో కోత తో పాటు కొత్త  రూల్స్ తో కొరడా ఝుళిపించనుంది. 

పొట్టి ఫార్మాట్ లో ఇకనుంచి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇన్నాళ్లు స్లో ఓవర్ రేట్ వేస్తే జట్టు మ్యాచ్ ఫీజు కోత కోసిన అంతర్జాతీయ క్రీకెట్ మండలి (ఐసీసీ) రూట్ మార్చింది. మ్యాచ్ జరుగుతుండగానే  పెనాల్టీలు వేయనున్నది. మ్యాచ్ ఫీజు కోతలు, హెచ్చరికలను జట్లు పట్టించుకోకపోవడంతో  ఐసీసీ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మ్యాచ్ మధ్య లో డ్రింక్స్ సమయాన్ని  కూడా పెంచింది. ఈ నెల నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ  కొత్త రూల్స్ ను ఐసీసీ క్రికెట్ కమిటీ రికమెండ్ చేసింది. 

పురుషుల, మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి కొత్త నిబంధనలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. క్లాజ్ 13.8 ప్రకారం.. బౌలింగ్ వేసే జట్టు వాళ్లకు నిర్దేశించిన టైం  మేరకే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి బంతిని వేయాలి. అలా వేయని పక్షంలో 30 గజాల సర్కిల్ వెలుపల నిర్దేశించిన నిబంధనలకంటే ఒక ఫీల్డర్ ను తక్కువగా అనుమతిస్తారు. ఈ  నిబంధనను ఇప్పటికే ఇంగ్లాండ్  లో ముగిసిన హండ్రెడ్ లీగ్ లో  ఇంగ్లాండ్  అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అమలుచేసింది. 

 

🏏 An in-game penalty for overrate offence
🏏 An optional mid-innings drinks break

ICC has brought in two new interesting rules for the shortest format. Full details 👇

— Cricbuzz (@cricbuzz)

ఐచ్ఛిక విరామం : 

దీంతోపాటు.. మ్యాచ్ మధ్య ఇరు జట్ల ఆటగాళ్లు  ఒకసారి ఐచ్ఛిక విరామం (డ్రింక్స్ బ్రేక్) తీసుకోవచ్చు. దీనిని 2.30 నిమిషాలుగా నిర్ణయించారు. అయితే ఇది ఆయా సిరీస్ లకు ముందు ఇరు జట్ల పరస్పర ఒప్పందం మధ్య  తీసుకోవాల్సి ఉంటుంది. 

జనవరి 16 నుంచి అమలు..? 

ఈ కొత్త నిబంధనలను జమైకాలోని సబీనా పార్కులో వెస్టిండీస్-ఐర్లాండ్ మధ్య జనవరి 16న జరిగే మ్యాచ్ తో అమలు చేయనున్నారు. ఇక  మహిళల టీ20 ల విషయానికొస్తే.. ఇదే నెల 18న సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగబోయే మూడు మ్యాచుల సిరీస్ లో ప్రారంభించనున్నారు. ఇరు జట్ల మధ్య తొలి  టీ20  మ్యాచ్ ఈనెల 18న జరుగుతుంది. 

టీమిండియాకు అప్పట్నుంచే.. 

ఇక భారత జట్టుకు ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి లో కరేబియన్ జట్టు టీమిండియా పర్యటనకు రానున్నది. ఈ టూర్ లో విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 15 నుంచి వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉంది.   
 

click me!