
వాండరర్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ను ముప్పు తిప్పలు పెడుతున్న శార్దూల్ ఠాకూర్ పై ప్రశంసల వెల్లువ కురుస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో అతడు ఐదు వికెట్లు తీసి సఫారీ పతనాన్ని శాసించాడు. తొలి టెస్టులో విజృంభించిన పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు వికెట్లు తీయడానికి తంటాలు పడుతున్న చోట శార్దూల్ మాత్రం అదరగొట్టడంపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఓ ఆసక్తికర వీడియో క్లిప్ షేర్ చేశాడు.
తెలుగులో 90లలో వచ్చిన అమృతం సీరియల్ లోని ఓ వీడియో క్లిప్ ను వసీం జాఫర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ సీరియల్ లో శివాజీరాజా, గుండు హనుమంతరావు క్రికెట్ ఆడే ఎపిసోడ్ ఇప్పటికీ హైలైటే. ఇక ప్రత్యేకించి.. శివాజీరాజా బ్యాట్ పట్టుకుని ఉండగా బౌలర్ బంతి వేయడం.. అది అతడు చూడకపోవడం.. కీపర్ ‘వెల్ బాల్’ అనడం వంటివి ఫన్నీగా ఉంటాయి. అదే క్లిప్ ను జాఫర్ ఇప్పుడు షేర్ చేస్తూ.. ‘ఈరోజు శార్దూల్ ఠాకూర్ ను దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇలా ఎదుర్కున్నారు.. చాలా బాగా బౌలింగ్ చేశావు శార్దూల్...’ అని రాసుకొచ్చాడు.
శార్దూల్ ఠాకూర్ ను కొనియాడుతూ వసీం జాఫర్ తొలుత ఓ ట్వీట్ కూడా చేశాడు. అందులో.. ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్, టీమిండియాలు ఫెయిర్ ప్లే ను నమ్ముతారు. అందుకే ఠాకూర్.. కొత్త బ్యాటర్లకు బౌల్ చేయడు. అతడు భాగస్వామ్యాలను విడదీస్తాడు...’అని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా అమృతం సీరియల్ వీడియోను షేర్ చేయడం గమనార్హం.
శార్దూల్ కు కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్లు :
ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో ఠాకూర్, షమీ ధాటికి దక్షిణాఫ్రికా 75 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ తన కెరీర్లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతకుముందు అతడి ఉత్తమ ప్రదర్శన 4-61 గా ఉంది. తాజాగా ఠాకూర్ దానిని అధిగమించాడు. ఇక వాండరర్స్ లో ఐదు వికెట్లు తీసిన ఆరో బౌలర్ గా ఠాకూర్ ఘనత సాధించాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే (6-53), జవగళ్ శ్రీనాథ్ (5-10), ఎస్. శ్రీశాంత్ (5-40), బుమ్రా (5-54), మహ్మద్ షమీ (5-29) ఉన్నారు.