Saqlain Mushtaq: పాకిస్థాన్ కు మరో షాక్.. కోచ్ పదవికి రాజీనామా చేసిన సక్లయిన్ ముస్తాక్.. తర్వాత కోచ్ అతడేనా..?

By Srinivas MFirst Published Jan 3, 2022, 7:26 PM IST
Highlights

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు  మరో షాక్.  ఆ దేశపు జాతీయ జట్టు హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. పీసీబీ వ్యవహార శైలి నచ్చక అతడు తప్పుకున్నట్టు తెలుస్తున్నది.

సంక్షోభాలు, సంచలనాలకు వేదికగా నిలిచే పాకిస్థాన్ జట్టుకు ఒకేరోజు రెండు షాకులు తగిలాయి. ఆ జట్టు సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వగా.. ఆ జట్టు హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్థాన్ జట్టు జాతీయ కోచ్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ప్రకటన చేసిన వెంటనే సక్లయిన్ ముస్తక్ తన పదవి నుంచి  తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. పీసీబీ  వ్యవహార తీరుపై సక్లయిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. గతంలో కూడా రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ కాగానే మాజీ సారథి మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ లు కోచ్ పదవుల నుంచి  తప్పుకున్న విషయం తెలిసిందే. 

పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక ‘ది న్యూస్’లోని ఓ కథనం ప్రకారం... పాక్ కోచ్ వ్యవహారంపై రమీజ్ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ పై సక్లయిన్ నిరాశ చెందాడు. ‘పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాతీయ జట్టు సారథి బాబర్ ఆజమ్, హెడ్ కోచ్ సక్లయిన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తో నేను చర్చించాను.  విదేశీ కోచ్ పై వాళ్ల అభిప్రాయం వెల్లడించారు. ఒకవేళ విదేశీ కోచ్ ను జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై  వారు అభిప్రాయాలు తెలిపారు...’అని రమీజ్ రాజా అన్నట్టు తెలుస్తున్నది.

ఈ ప్రకటనపై సక్లయిన్ నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్థాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ అకస్మాత్తుగా కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో టీ20 ప్రపంచకప్ కు ముందు పీసీబీ.. సక్లయిన్ ను  టెంపరరీ కోచ్ గా నియమించింది. అతడి నేతృత్వంలో పాక్ జట్టు.. ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్ లో సెమీస్ కు చేరింది. ఈ నేపథ్యంలో సక్లయిన్ నే కొనసాగిస్తారని  అతడు ఆశించినా.. పీసీబీ మాత్రం హెడ్ కోచ్ కు షాకిచ్చింది. విదేశీ కోచ్ వైపే వెళ్లాలనుకుంటున్నది. దీంతో సక్లయిన్ తన పదవి నుంచి తప్పుకున్నాడు.  

కొత్త కోచ్ అతడేనా..? 

సక్లయిన్ తప్పుకున్న నేపథ్యంలో కొత్త కోచ్ ఎవరనేదానిపై ఇప్పుడే పాక్ క్రికెట్ లో జోరుగా చర్చ మొదలైంది. అయితే 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్  సాధించడంలో కీలక భూమిక పోషించిన సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటికే అతడు  పాక్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

సుదీర్థ కెరీర్ కు హఫీజ్ వీడ్కోలు... 
 
సోమవారం ఆ జట్టు మాజీ సారథి మహ్మద్ హఫీజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. 2003 ఆగస్టు 3 న షార్జాలో జింబాబ్వే తో జరిగిన వన్డే మ్యాచులో అరంగ్రేటం చేసిన హఫీజ్.. సుదీర్ఘకాలం పాటు పాక్ జాతీయ జట్టుకు సేవలందించాడు. తన కెరీర్ లో పాక్ తరఫున మొత్తంగా 392 అంతర్జాతీయ మ్యాచులు(అన్ని ఫార్మాట్లలో) ఆడిన హఫీజ్.. 12,780 పరుగులు చేశాడు. బౌలర్ గా 253 వికెట్లు తీశాడు. అంతేగాక అతడు పాక్ జట్టుకు 32 అంతర్జాతీయ మ్యాచులలో సారథిగా వ్యవహరించాడు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ  గెలిచిన పాక్ జట్టులో హఫీజ్ సభ్యుడు. 

అంతేగాక.. మూడు వన్డే ప్రపంచకప్పు (2007, 2011, 2019) లలో అతడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఏకంగా ఆరు పొట్టి ప్రపంచకప్ (2007, 2010, 2012, 2014, 2016, 2021) లలో పాక్ తరఫున ఆడటం గమనార్హం. మూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2006, 2013, 2017) లలో కూడా పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 

click me!