Bangladesh vs India Highlights : న్యూయార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో బంగ్లాదేశ్‌ను భారత్ 60 పరుగుల తేడాతో ఓడించింది.
T20 World Cup 2024 - IND vs BAN : టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందు భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్యా 40 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దుబేలతో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ 122 పరుగులకే పరిమితమైంది.
రిషబ్ పంత్పం-హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్..
undefined
ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యి తిరిగి పెవిలియన్ బాట పట్టాడు. పంత్ 4 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బ్యాట్‌తో ఫ్లాప్ అయిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ తో ఫామ్‌లో కనిపించాడు. 23 బంతుల్లో 40 పరుగులు తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 17వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. వీరికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులు, రోహిత్ శర్మ 23 పరుగులు చేశారు.
శాంసన్-దూబే ఫ్లాప్ షో..
ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ ఫ్లాప్ అయ్యాడు. శాంసన్, కెప్టెన్ రోహిత్ ఓపెనర్లకు వచ్చారు. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండానే శాంసన్ 1 పరుగుకే ఔట్ అయ్యాడు. హిట్ మ్యాన్ 23 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. శివమ్ దూబే కూడా 16 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు.
బౌలింగ్‌లో బుమ్రా-అర్ష్‌దీప్ మెరుపులు..
బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు శుభారంభం అందించాడు. సౌమ్య సర్కార్ (0)ని తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు పంపాడు. తన తర్వాతి ఓవర్‌లోనే అతను మళ్లీ ఒక వికెట్ తో లిటన్ దాస్ (6 పరుగులు)ను అవుట్ చేశాడు. మరికొద్ది సేపటికే కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో (0) ను ఔట్ చేసి బంగ్లాదేశ్ ను కష్టాల్లో పడేశాడు మహ్మద్ సిరాజ్. అక్షర్ పటేల్ నాలుగో వికెట్ గా తౌహీద్ హృదయ్ (13 పరుగులు) ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా 5వ వికెట్ తో బంగ్లాదేశ్ జట్టులో సగం మంది పెవిలియన్ బాట పట్టారు.
షకీబ్-మహ్మదుల్లా ప్రయత్నించినా..
షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా వరుస వికెట్లు పడిన తర్వాత జట్టు స్కోర్ బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ, సఫలం కాలేదు. బుమ్రా బౌలింగ్ లో 28 పరుగుల వద్ద షకీబ్‌ను అవుట్ అయ్యాడు. 40 పరుగులు చేసిన మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ కు చేరుకున్నాడు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 122 పరుగులు చేసింది.
T20 WORLD CUP 2024 కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి శివమ్ దూబేకు బౌలింగ్ చిట్కాలు.. వీడియో