Imran Khan: ఓడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్.. రాజకీయ పిచ్ పై పారని దిగ్గజ బౌలర్ బౌన్సర్లు

Published : Apr 04, 2022, 04:54 PM IST
Imran Khan: ఓడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్.. రాజకీయ పిచ్ పై పారని దిగ్గజ బౌలర్ బౌన్సర్లు

సారాంశం

Pakistan Political Crisis: ఆయన క్రికెట్ ఆడినంత కాలం పాకిస్థాన్ కు స్వర్ణయుగమే.  ఆల్ రౌండర్ గా గుర్తింపు  పొందిన ఆ దిగ్గజ క్రికెటర్.. రాజకీయాల్లో మాత్రం అంత సాఫీగా సాగడం లేదు. 20 ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసినా  వచ్చిన పదవి పూర్తి కాలం లేకుండానే  పోయింది.

పాకిస్థాన్  క్రికెట్ లో ఇమ్రాన్ ఖాన్ నిస్సందేహంగా లెజెండరీ క్రికెటర్.  రెండు దశాబ్దాల (1971-1992) వరకు పాక్ క్రికెట్ ను తన భుజాలపై మోసిన దిగ్గజమాయన. భారత్ లో  కపిల్ దేవ్ ఎలాగో.. పాక్ కు ఇమ్రాన్ ఖాన్ అలాగే అనడంలో సందేహమే లేదు. ఇద్దరూ ఒకే కాలానికి చెందిన క్రికెటర్లు. ఇద్దరూ వారి దేశాలకు వన్డే ప్రపంచకప్ అందించినవారే. కపిల్ సంగతి కాస్త పక్కనబెడితే...  పాక్ క్రికెట్ గురించి చెప్పుకుంటే ఇమ్రాన్ ఖాన్ ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సిందే.  21 ఏండ్ల పాటు ప్రత్యర్థులను బౌలర్ గా తన పదునైన బౌన్సర్లతో, సారథిగా తన వ్యూహాలతో ముప్పుతిప్పలు పెట్టిన ఈ దిగ్గజం.. రాజకీయాల్లో మాత్రం మ్యాచ్ ఓడకుండానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు.  బంతి విసరకుండానే భారీగా  పరుగులిచ్చుకుని దేశ ప్రజల ముందు పరువు పోగొట్టుకున్నారు. 

పాకిస్థాన్ లో అయితే నువ్వు లేకుంటే నేను అని  అధికారాన్ని వంతులుగా విభజించుకుని పాలిస్తున్న నవాజ్ షరీఫ్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్), భుట్టో (పాకిస్థాన్ పీపుల్స్) లకు చెందిన పార్టీల హవాను తట్టుకుని ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ఎదగడం అంత  సులువుగా జరగలేదు.  ఆయన క్రికెట్ ఆడినంత కాలం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో అధికారం కోసం   పోరాడాల్సి వచ్చింది. 

1996 నుంచి పోరాటం.. 

1992లో పాక్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన ఈ దిగ్గజ ఆల్ రౌండర్.. తర్వాత  క్రికెట్ నుంచి  తప్పుకున్నాడు. పాక్ ప్రజల కష్టాలను చూసి చలించిన ఇమ్రాన్.. 1996లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని నెలకొల్పారు.   దేశానికి ప్రపంచకప్ అందించినా..  ఆల్ రౌండర్ గా ఎన్నో మ్యాచుల్లో దేశాన్ని ఒంటి చేత్తో గెలిపించినా  ప్రజలకు మాత్రం అతడి మీద ఉన్న అభిమానం.. రాజకీయాల్లో గేట్ పాస్ కాలేకపోయింది. 1996లో పార్టీ స్థాపించిన ఆయన.. 2002లో  జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో  పీటీఐని  రెండో అతిపెద్ద పార్టీగా నిలిపారు.  

 

2013 లో ప్రజలు  కాస్త ధైర్యమివ్వడంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలకు ఆశల  హామీలను గుప్పించాడు. దేశంలో అవినీతిని రూపుమాపుతానని,  పేదరికాన్ని నిర్మూలిస్తానని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి పాక్ ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా నిలపుతానని ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారు.  ప్రజలు నమ్మారు.  2018లో  ఇమ్రాన్ ఖాన్  20 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన దేశ ప్రధాని అయ్యారు. సొంతగా మోజారిటీ రాకున్నా చోటా మోటా పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 

ఆకాంక్షలు నెరవేరలే.. 

ఇమ్రాన్ ప్రధాని కల నెరవేరిందే గానీ  ప్రజలకిచ్చిన హామీలు మాత్రం అటకెక్కాయి. తీవ్రవాదం మరింత పడగ విప్పింది. పేదరికం నానాటికీ పెరుగుతూనే ఉంది. ధరలు ఆకాశాన్నంటాయి.  నిత్యావసరాలను ప్రజలు కొనలేని స్థితికి వచ్చింది.  దీంతో అప్పటిదాకా అదును కోసం వేచి చూస్తున్న ప్రతిపక్షాలు.. ఇమ్రాన్ ఖాన్ ఆట కట్టించేందుకు సిద్ధమయ్యాయి.  దీనికి తోడు సొంత పార్టీలో కూడా ముసలం ముదిరింది.  పాక్ లో  ఏ ప్రభుత్వం వచ్చినా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే ఆర్మీ నమ్మకం కూడా  ఇమ్రాన్ ఖాన్ కోల్పోయారు.   అంతే.. ప్రతిపక్షాలు  ఆయనను దించేయడానికి వ్యూహం పన్నాయి.  

చివరి బంతి ఆడకుండానే... 

అయితే తాను క్రీడాకారుడినని, ఆఖరు బంతి దాకా పోరాడతానని  మొదట్నుంచి చెప్పుకొచ్చిన  ఇమ్రాన్ ఖాన్.. మ్యాచ్ ముగియకముందే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.  ఈనెల 3న పాక్ జాతీయ అసెంబ్లీలో  ప్రతిపక్షాలు స్పీకర్ కు ఇచ్చిన అవిశ్వాసం తీర్మానాన్ని చెల్లదంటూ అనిపించి..   వారిని క్లీన్ బౌల్డ్ చేశారు.  అంతటితో ఆగకుండా అసెంబ్లీని రద్దు చేసి మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నారు.  విదేశీ కుట్ర, తనను చంపడానికి యత్నించారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ తిరిగి ఎన్నికవుతారా..? లేదా..? అనేది ప్రజలు నిర్ణయిస్తారు.

అయితే తన పదునైన బౌన్సర్లు, లోపలికి దూసుకొచ్చే ఇన్ స్వింగర్లతో  ప్రత్యర్థులను ముుప్పుతిప్పలు పెట్టిన  దిగ్గజ క్రికెటర్.. రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థుల వ్యూహాలకు సమాధానం దొరకక చతికిలపడుతున్నారు. పాకిస్థాన్  చరిత్రలో ఇమ్రాన్ ఖాన్ అయినా తొలి సారి పదవీకాలం పూర్తి చేసిన ప్రధాని అవుతాడని ఆశించిన చాలా మందికి ఆయన కూడా అతీతుడేమీ కాదని తేల్చి చెప్పారు. గతంలో ఏ ప్రధాని కూడా పాక్ కు పూర్తి స్థాయి  పీఎంగా పని చేయలేదు. ఎందుకని అడగకండి..! అదంతే..! అది పాకిస్థాన్..!!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !