ఒకవేళ మీరు అలాంటి వాడి కోసం చూస్తే ఆసీస్ కెప్టెన్ లేకుండా ఉండాల్సిందే.. మైకెల్ క్లార్క్ షాకింగ్ కామెంట్స్

By team teluguFirst Published Nov 24, 2021, 4:34 PM IST
Highlights

Michael Clarke: టిమ్ పైన్ వివాదం ఆసీస్ ను ఓ కుదుపు కుదుపుతున్నది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని  ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముందు అతడు కెప్టెన్సీ నుంచి  వైదొలగడంతో ఇప్పటివరకు ఆ జట్టు కొత్త కెప్టెన్ ను నియమించలేదు. 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ సారథ్య బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ తప్పుకున్న నేపథ్యంలో తర్వాత కెప్టెన్ ఎవరా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, మాజీ సారథి స్టీవ్ స్మిత్ నాయకుడి రేసులో ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని నాయకుడిగా నియమించాలని కూడా ఇప్పటికే పలువురు మాజీలు క్రికెట్ ఆస్ట్రేలియాను కోరారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు సమయం (డిసెంబర్ 8 నుంచి తొలి టెస్టు)  దగ్గరపడుతున్న   నేపథ్యంలో కొత్త సారథిని త్వరగా నియమించాలని ఆసీస్ అభిమానులు కోరుతున్నారు. 

అయితే ఇదే విషయమై తాజాగా ఆ జట్టు మాజీ సారథి మైకెల్  క్లార్క్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ఏ మచ్చ లేని మంచి సారథి దొరకడం ఆస్ట్రేలియాలో కష్టమని, అలాంటి వాడి కోసం చూస్తే మరో 15 సంవత్సరాలైనా ఆసీస్ టెస్టు జట్టుకు కెప్టెన్ దొరకడని కుండ బద్దలు కొట్టాడు. క్లార్క్ స్పందిస్తూ...‘ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు సారథ్యం వహించడమనేది ఒక బాధ్యతతో కూడుకున్నది. అందులో  సందేహం లేదు. అయితే ఈ స్థానం కోసం మచ్చలేని మంచి  సారథిని వెతకాలంటే మాత్రం ఆస్ట్రేలియాకు మరో పదిహేనేండ్లైనా కెప్టెన్ దొరకడు..’ అని అన్నాడు.

Also Read: Tim Paine: జెంటిల్మెన్ గేమ్ లో జగత్ కంత్రీలు.. క్రికెట్ లో అతి పెద్ద సెక్స్ స్కాండిల్స్ ఇవే..

ఆసీస్ మాజీ సారథులు రికీ పాంటింగ్ తో పాటు తాను (క్లార్క్) కూడా అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో పడుతూ లేస్తూ పైకెదిగినవాళ్లమే అని.. పర్ఫెక్ట్  కెప్టెన్ అనేది అర్థం లేని వాదన అని క్లార్క్ కొట్టి పారేశాడు. ‘మీరు రికీపాంటింగ్ ను చూడండి. అంతర్జాతీయ కెరీర్ లో పాంటింగ్ కూడా  ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కానీ తర్వాత దేశం గర్వించదగ్గ కెప్టెన్ అయ్యాడు. మీరు గిరిగీసుకున్నట్టు అన్ని రకాలుగా సమర్థుడే కావాలంటే పాంటింగ్ కెప్టెన్ అయి ఉండేవాడా..?’ అని క్లార్క్ ప్రశ్నించాడు. 

అయితే పైన్ ఎందుకు రాజీనామా చేశాడో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని క్లార్క్ అన్నాడు. నాలుగేండ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు రాజీనామా చేయడమేంటని ప్రశ్నించాడు. ‘నాకస్సలు అర్థం కావడం లేదు.  ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని నీకు చాయిస్ లేదంటే అతడు ఇలా చెప్పి ఉండాల్సింది.. అది మీ పరిధిలోని అంశం. మీరు నన్ను తొలగించాలనుకుంటే తీసేయండి.  ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు నాలుగేండ్ల క్రితమే అందించాను. కానీ ఇప్పుడు నన్ను దిగిపొమ్మంటే ఎలా..? పైన్ విషయం బహిర్గతమైనందున ఆ నియయాలు ఏమైనా మారుతాయా..?  నేనైతే అలా అనుకోను. మీరు ఈ విషయాన్ని నాలుగేండ్ల క్రితమే క్లీయర్ చేయాల్సింది..’ అని క్లార్క్ చెప్పాడు.   

కాగా.. 2017లో తన తో పని చేస్తున్న ఓ మహిళకు పైన్ అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించి సదరు మహిళ క్రికెట్ ఆస్ట్రేలియా కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఏ విచారణ చేపట్టింది. పైన్  ను కూడా విచారించింది. ఇద్దరి వాదనలు విన్న బోర్డు.. పైన్ పై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన అతడు.. తాను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథిగా ఉండటానికి అనర్హుడినంటూ  తెలిపిన విషయం  తెలిసిందే.

click me!