Ind Vs Nz: శ్రేయస్ అయ్యరా..? సూర్యకుమారా..? కాన్పూర్ లో కివీస్ తో తొలి టెస్టు ఆడేది ఎవరో చెప్పేసిన రహానే..

By team teluguFirst Published Nov 24, 2021, 3:31 PM IST
Highlights

India Vs New Zealand 1st Test: గురువారం నుంచి టీమిండియా-న్యూజిలాండ్ మధ్య  కాన్పూర్ వేదికగా  ఆరంభం కాబోయే తొలి టెస్టులో జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చింది. ఈ మేరకు జట్టు స్టాండ్ బై కెప్టెన్ అజింక్యా రహానే వివరాలు వెల్లడించాడు. 

న్యూజిలాండ్ తో రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత జట్టు తుది జట్టును సిద్ధం చేసే పనిలో పడింది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టులో భారత సారథి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో.. అజింక్యా రహానే సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. అయితే తొలి టెస్టు కోసం శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. వీళ్లిద్దరిలో ఎవరిని తుది జట్టును ఎంపిక చేస్తారనే విషయమ్మీద  స్పష్టత  వచ్చింది. ఈ మేరకు  మొదటి టెస్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్న అజింక్యా రహానే వివరాలను వెల్లడించాడు. 

రహానే మాట్లాడుతూ.. కాన్పూర్ టెస్టులో శ్రేయస్ అయ్యర్ అరంగ్రేటం చేయబోతున్నాడని తెలిపాడు. ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నామని కూడా అతడు చెప్పాడు. తొలి టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రహానే మాట్లాడుతూ.. ‘అవును.. శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టులో అరంగ్రేటం చేయబోతున్నాడు..’ అని చెప్పాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అయ్యర్ ను ఐదో స్థానంలో పంపే అవకాశాలున్నాయి. ఒకవేళ రహానే ఆ స్థానంలో బ్యాటింగ్ కు వస్తే.. అయ్యర్ ను నాలుగో స్థానంలోనే ప్రమోట్ చేయొచ్చు. కాగా కెఎల్ రాహుల్ కు గాయం కావడంతో తుది జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కు మొండిచేయే ఎదురుకానుంది. 

2017లో భారత జట్టులోకి ప్రవేశించిన అయ్యర్.. ఇప్పటివరకు టెస్టులు ఆడలేదు. అంతేగాక 2019 నుంచి అతడు రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. చివరిసారి అతడు ఇరానీ కప్ లో భాగంగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. కానీ భుజం గాయం కారణంగా అందులో కూడా పెద్దగా రాణించలేదు. దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న ఈ ముంబై కుర్రాడి బ్యాటింగ్ సగటు బాగానే ఉంది. ఈ ఫార్మాట్ లో  అతడు 52.18 సగటు, 81.54  స్ట్రైక్ రేట్ తో బాగానే కనిపిస్తున్నా తొలి  టెస్టులో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. 

ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్టు రహానే తెలిపాడు.  కాన్పూర్ లో అశ్విన్, జడేజా, అక్షర్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నట్టు రహానే సూచనాప్రాయంగా చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్ లో పర్యటించిన ఇంగ్లాండ్ కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. నాలుగు టెస్టుల ఆ సీరిస్ ను భారత్ 3-1తో నెగ్గింది. ఈ సిరీస్ లో అశ్విన్.. నాలుగు టెస్టులలో 32 వికెట్లు తీయగా..  మూడు టెస్టులాడిన అక్షర్ 27 వికెట్లు తీశాడు. ఇక 2016లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ ను ఇదే కాన్పూర్ గ్రౌండ్ లో రవీంద్ర జడేజా తన స్పిన్ తో నిలువరించాడు. ఆ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్లు తీయగా.. రెండో టెస్టులో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు.  

మొత్తంగా ఆరుగురు  బ్యాటర్లు (మయాంక్ అగర్వాల్,  శుభమన్ గిల్, పుజారా, రహానే, అయ్యర్, వృద్ధిమాన్ సాహా) లతో పాటు ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా, అక్షర్), ఇద్దరు సీమర్లు (ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్) లతో టీమిండియా తొలి టెస్టులో బరిలోకి దిగనున్నది.  

click me!