వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాప్! పూర్తి లంక క్రికెట్ బోర్డుపై వేటు వేసిన శ్రీలంక ప్రభుత్వం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 6, 2023, 3:32 PM IST

శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం...  అర్జున రణతుంగ అధ్యక్షతన 7 సభ్యుల ఇంటర్న్ కమిటీ ఆధ్వర్యంలో లంక క్రికెట్ జట్టు కార్యకలాపాలు..


వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది శ్రీలంక. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజులకే పూర్తి శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే, లంక బోర్డులో ప్రతీ సభ్యుడిని బాధ్యతల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు ప్రకటించాడు.

శ్రీలంక బోర్డు అడ్మినిస్ట్రేటర్ షమ్మీ సిల్వ ఇప్పటికే రాజీనామా చేయగా 1992 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ అధ్యక్షతన 7 సభ్యుల ఇంటర్న్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు కార్యకలాపాలు సాగబోతున్నాయి..

Latest Videos

undefined

‘శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ప్లేయర్ల క్రమశిక్షణ రాహిత్య ఆరోపణలు, మేనేజ్‌మెంట్ అవినీతి, ఆర్థిక నేరాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దాన్ని తొలగించడం జరిగింది. మంచి గవర్నింగ్ పాలసీ రూపొందించేందుకే మేం పని చేస్తాం..’ అంటూ ఇంటర్న్ కమిటీ అధ్యక్షుడు అర్జున రణతుంగ తెలియచేశాడు. 

మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, తిలకరత్నే దిల్షాన్, లసిత్ మలింగ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత శ్రీలంక ఆట తీరు పూర్తిగా దిగజారింది. 2022 టీ20 వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయర్స్ ఆడిన శ్రీలంక, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం క్వాలిఫైయర్స్ ఆడి గెలిచింది..

గత ఏడాది పాకిస్తాన్‌‌ని ఓడించి ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచిన శ్రీలంక, 2023లో మాత్రం అదే ఫీట్‌ని రిపీట్ చేయలేకపోయింది. ఫైనల్‌కి వచ్చిన శ్రీలంక, భారత జట్టు చేతుల్లో 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలో ఛేదించింది..

తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక, 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్టులో శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసి శ్రీలంక మొత్తం జట్టు కలిసి చేసిన పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశారు..

అంతకుముందు ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన శ్రీలంక, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 344 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. 

click me!