ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో వాతావరణ పరిస్ధితుల కారణంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మద్య జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
హైదరాబాద్ : దేశ రాజధాని డిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరమంతా విషపూరిత దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిల్లీలో నేడు శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగాల్సి వుంది. డిల్లీలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓ రోజంతా ఆటగాళ్లు మైదానంలో వుండటం ప్రమాదకరమని ఐసిసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ను రద్దుచేసే ఆలోచనలో ఐసిసి వున్నట్లు తెలుస్తోంది.
రాజధాని డిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం 504 గా నమోదయ్యింది. ఆదివారం ఇది కాస్త తగ్గి 486 కు చేరుకుంది. గాలిలో విష వాయువుల గాడత 2.5 గా వున్నట్లు... ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే ఆటగాళ్లతో పాటు అభిమానులు శ్వాస సంబంధింత సమస్యల బారినపడే అవకాశాలున్నాయని ఐసిసి ఆందోళన చెందుతోంది. దీంతో మ్యాచ్ నిర్వహణపై ఆయా జట్ల మేనేజ్ మెంట్, ఆటగాళ్ళ అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోనుంది.
కాలుష్య పరిస్థితుల కారణంగా ఇప్పటికే శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ప్రాక్టీస్ ను రద్దు చేసుకుని హోటల్ రూమ్ కే పరిమితం అయ్యారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం మాస్కులు ధరించి కాస్సేపు ప్రాక్టీస్ చేసారు.
Read More ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూల్స్‌కు సెలవులు..
ఇదిలావుంటే డిల్లీలో శ్రీలంక, బంగ్లాదేశ్ మద్య మ్యాచ్ నిర్వహణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నాయో లేదో తెలుసుకునేందకు బిసిసిఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంవద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రణదీప్ గలారియా సహాయం తీసుకుంటోంది.