Afghanistan vs Netherlands: 46.3 ఓవర్లలో 179 పరుగులకి ఆలౌట్ అయిన నెదర్లాండ్స్... టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు రనౌట్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్‌తో తలబడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్, 46.3 ఓవర్లలో 179 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
వెస్లీ బర్రెసీ 1 పరుగు చేసి అవుట్ కాగా మ్యాక్స్ ఓడాడ్, కోలిన్ అకీర్‌మన్ కలిసి రెండో వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 40 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన మ్యాక్ ఓడాడ్, 35 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన కోలీన్ అకీర్‌మన్, 86 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్... నలుగురు కూడా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే రనౌట్ అయ్యాడు. బస్ దే లీడే 3, సకీబ్ జుల్ఫీకర్ 3, లోగన్ వాన్ బీక్ 2, వాన్ దేర్ మెర్వీ 11, ఆర్యన్ దత్ 10, పాల్ వాన్ మికీరన్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఆఫ్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీకి 3 వికెట్లు దక్కగా నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ముజీబ్ వుర్ రహీంకి ఓ వికెట్ దక్కింది. లక్నో పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 230 పరుగులను ఛేదించలేక 100 పరుగుల తేడాతో ఓడింది.
ఈ మ్యాచ్ గెలిస్తే ఆఫ్ఘాన్ సెమీస్ రేసులోకి దూసుకొస్తుంది. లేదంటే పాకిస్తాన్‌కి ఛాన్సులు పెరుగుతాయి.