ICC World cup 2023: బౌలింగ్ అదిరింది! పాకిస్తాన్‌ ఆలౌట్.. టీమిండియా ముందు..

By Chinthakindhi Ramu  |  First Published Oct 14, 2023, 5:24 PM IST

ICC World cup 2023: 191 పరుగులకి పాకిస్తాన్ ఆలౌట్..  50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, 49 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్..  రెండేసి వికెట్లు తీసిన జడేజా, కుల్దీప్, హార్ధిక్, బుమ్రా, సిరాజ్.. 


India vs Pakistan: అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ చేసినా సూపర్ ఫామ్‌లో ఉన్న మహ్మద్ రిజ్వాన్ 49 పరుగులు చేసిన భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

24 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. గత రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మహ్మద్ సిరాజ్‌కి గత నాలుగు వన్డేల్లో పవర్ ప్లేలో దక్కిన మొదటి వికెట్ ఇదే...

Latest Videos

undefined

38 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయ్యే ముందు హార్ధిక్ పాండ్యా, బంతిని చేతుల్లోకి తీసుకుని ఏదో మంత్రాలు చదివినట్టు కోరుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..  73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్...

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 34 పరుగుల వద్ద బాబర్ ఆజమ్‌ అవుట్ కోసం అప్పీలు చేసింది టీమిండియా. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో డీఆర్‌ఎస్ తీసుకుంది. టీవీ రిప్లైలో అంపైర్ కాల్స్‌గా తేలడంతో బాబర్ ఆజమ్‌కి అదృష్టం కలిసి వచ్చింది. 

బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి మూడో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ని మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్..

10 బంతుల్లో 6 పరుగులు చేసిన సౌద్ షకీల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది. వస్తూనే ఫోర్ బాదిన ఇఫ్తికర్ అహ్మద్‌ని అదే ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్ యాదవ్.. వైడ్ వెళ్తున్న బంతిని స్వీప్ ఆడబోయిన ఇఫ్తికర్, వికెట్లపైకి కొట్టుకున్నాడు...

ఆ తర్వాతి ఓవర్‌లో జస్ప్రిత్ బుమ్రాని తిరిగి తీసుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. 69 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన షాదబ్ ఖాన్ కూడా బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

16 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్.. మహ్మద్ నవాజ్, హసన్ ఆలీ కలిసి 8వ వికెట్‌కి 16 పరుగులు జోడించారు. 14 బంతుల్లో 4 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..  ఆ తర్వాతి బంతికే హసన్ ఆలీ కూడా అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన హసన్ ఆలీ, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.   2 పరుగులు చేసిన హారీస్ రౌఫ్‌ని జడేజా అవుట్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. 

155/2 స్కోరుతో ఉన్న పాకిస్తాన్, 36 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 7 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 

click me!