20 ఓవర్లలో వికెట్ నష్టానికి 427 పరుగులు కొండంత స్కోరు చేసిన అర్జెంటీనా... 63 పరుగులకే ఆలౌట్ అయిన చిలీ! 364 పరుగుల తేడాతో టీ20 చరిత్రలో భారీ విజయం...
50 ఓవర్ల క్రికెట్‌లో 400+ స్కోరు చేయడమే చాలా కష్టం. బౌలింగ్ మరీ బలహీనంగా ఉండి, పిచ్ బ్యాటింగ్‌కి బీభత్సంగా సహకరిస్తే కానీ వన్డేల్లో 400+ స్కోరు నమోదు కాదు. అలాంటి ఓ టీ20 మ్యాచ్‌లో 400+ స్కోరు నమోదైంది. అది కూడా పురుషాధిక్య క్రికెట్ ప్రపంచం చులకనగా చూస్తే మహిళా క్రికెట్‌లో...
అర్జెంటీనా, చీలి మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జరిగిందీ వరల్డ్ రికార్డు ఫీట్. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 427 పరుగులు కొండంత స్కోరు చేసింది..
undefined
ఓపెనర్లు లూసియా టేలర్, అల్బెటినా గలన్ కలిసి 16.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 350 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 84 బంతుల్లో 27 ఫోర్లతో 169 పరుగులు చేసిన లూసియా టేలర్.. మిరందా బౌలింగ్‌లో అవుటైంది. అల్బెటినా గలన్ 84 బంతుల్లో 23 ఫోర్లతో 145 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ కలిసే 168 బంతులు ఆడారు, టీ20లో ఉండేదే 120 బంతులని అనుమానం రావచ్చు. కానీ అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 73 పరుగులు వచ్చాయి. ఇందులో 64 నో బాల్స్ ఉన్నాయి. ఈ నో బాల్స్ కారణంగా అర్జెంటీనా స్కోరు కొండంత పెరిగింది.
వన్‌డౌన్‌లో వచ్చిన మరియా కస్టెనెరస్ 16 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసింది. 428 పరుగుల లక్ష్యఛేదనలో చిలీ మహిళా జట్టు, 15 ఓవర్లు బ్యాటింగ్ చేసి 63 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చిలీ ఇన్నింగ్స్‌లో జెస్సికా మిరందా 27 పరుగులు చేయగా ఎక్స్‌ట్రాల రూపంలో 29 పరుగులు వచ్చాయి. మిగిలిన 10 మంది బ్యాటర్లు అందరూ కలిసి 7 పరుగులే చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇందులో నలుగురు రనౌట్ అయ్యారు.
364 పరుగుల తేడాతో టీ20 చరిత్రలో భారీ విజయం అందుకుంది అర్జెంటీనా. 490 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం మరో విశేషం..