ICC World cup 2023 Final: ఫైనల్ ఫోబియా! 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా..

By Chinthakindhi Ramu  |  First Published Nov 19, 2023, 3:06 PM IST

ICC World cup 2023 Final:  81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా... 4 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్.. 


టీమిండియా బ్యాటర్లు మరోసారి ఒత్తిడికి చిత్తయ్యారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో పాటు అహ్మదాబాద్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న లోకల్ బాయ్ శుబ్‌మన్ గిల్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ మరోసారి తన స్టైల్‌లో మెరుపులు మెరిపించి, మరో 40+ స్కోరు చేసి అవుట్ అయ్యాడు..

 7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..

Latest Videos

undefined

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మ వికెట్ కోసం ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది ఆస్ట్రేలియా. తొలి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. 

హజల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్, ఫస్ట్ స్లిప్‌లో మిచెల్ మార్ష్‌కి అందలేదు. అలా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న శుబ్‌మన్ గిల్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు..

ఫీల్డ్‌లో మెరుపులా కదులుతున్న ఆస్ట్రేలియా ఫీల్డర్లు, మొదటి 2 ఓవర్లలోనే దాదాపు 3 బౌండరీలను అడ్డుకున్నారు. స్టార్క్ ఓవర్‌లో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఓ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు..

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 పరుగులు చేయగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని అధిగమించేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 46 పరుగులు జోడించారు..

31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ పట్టిన సూపర్ క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వరల్డ్ కప్‌లో పవర్ ప్లేలో బ్యాటింగ్‌కి వచ్చిన మూడు సార్లు కూడా శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు దాటలేకపోయాడు. ఆసీస్‌పై మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన అయ్యర్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

click me!