పాకిస్తాన్ ముందు 338 పరుగుల భారీ టార్గెట్.. 6.2 ఓవర్లలోపు ఛేదిస్తేనే సెమీస్ చేరే ఛాన్స్... హారీస్ రౌఫ్ ఖాతాలో చెత్త రికార్డు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీస్ రేసులో నిలిచిన పాకిస్తాన్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవ్వాల్సినంత పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోరు చేసింది..
డేవిడ్ మలాన్ 39 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేయగా జానీ బెయిర్‌స్టో 61 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత బెన్ స్టోక్స్, జో రూట్ కలిసి మూడో వికెట్‌కి 132 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు..
72 బంతుల్లో 4 ఫోర్లతో 60 పరుగులు చేసిన జో రూట్‌ని షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేయగా బెన్ స్టోక్స్ 76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేయగా హారీ బ్రూక్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు..
మొయిన్ ఆలీ 8, డేవిడ్ విల్లే 5 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదిన డేవిడ్ విల్లేని అవుట్ చేసిన మహ్మద్ వసీం జూనియర్, ఆ తర్వాతి బంతికి గుస్ అట్కీన్సన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో 533 పరుగులు ఇచ్చిన హారీస్ రౌఫ్, ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2019 వన్డే వరల్డ్ కప్‌లో అదిల్ రషీద్ 11 మ్యాచుల్లో 526 పరుగులు ఇవ్వగా, హారీస్ రౌఫ్ 9 మ్యాచుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు..