అండర్-19 వరల్డ్‌ కప్ 2022 షెడ్యూల్ విడుదల... టీమిండియా ఆడే మ్యాచులు ఇవే...

By Chinthakindhi RamuFirst Published Nov 18, 2021, 1:10 PM IST
Highlights

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకూ వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్‌ కప్ టోర్నీ...  గ్రూప్-బీలో టీమిండియాతో పాటు ఉగాండా, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లు... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ విజయవంతంగా ముగిసింది. దీంతో వచ్చే ఐదారేళ్ల పాటు నిర్వహించబోయే ఐసీసీ మెగా టోర్నీల షెడ్యూల్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇప్పటికే 2031 వన్డే ప్రపంచకప్ వరకూ జరగబోయే టోర్నీల వేదికలను ఖరారు చేసిన ఐసీసీ, తాజాగా వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 వరల్డ్‌ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది...

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకూ వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్‌ కప్ టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో మొత్తంగా 48 మ్యాచులు జరుగుతాయి. అండర్-19 వరల్డ్‌ కప్ టోర్నీలో భారత జట్టు గ్రూప్ బీలో తలబడబోతోంది. గ్రూప్-బీలో టీమిండియాతో పాటు ఉగాండా, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ జట్లలో ఉగాండా మొట్టమొదటిసారి అండర్-19 వరల్డ్‌ కప్ ఆడనుంది.

గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, కెనడా, యూఏఈ జట్లు ఉండగా, గ్రూప్-సీలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, పపువా న్యూ గినీ, గ్రూప్- డీలో ఆతిథ్య వెస్టిండీస్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి... అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ నుంచి న్యూజిలాండ్ జట్టు తప్పుకుంది.

జనవరి 15న సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడే టీమిండియా, 19న ఐర్లాండ్‌తో, 22న ఉగాండాతో మ్యాచులు ఆడుతుంది. 

టోర్నీల్లో పాల్గొన్న తర్వాత తిరిగి స్వదేశం చేరుకునేందుకు కివీస్ ప్రభుత్వం క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. దీంతో మైనర్లు క్వారంటైన్‌లో ఒంటరిగా గడపలేరని భావించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్వచ్ఛందంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది...

న్యూజిలాండ్ స్థానంలో స్కాట్లాండ్‌కి గ్రూప్ డీలో అవకాశం దక్కింది. నాలుగు గ్రూప్‌ల నుంచి టేబుల్ టాపర్‌గా ఉన్న ఒక్కో జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి. నాలుగు కరేబియన్ దేశాల్లోని 10 వేదికల్లో అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. అంటిగువా అండ్ బార్బుడా, గుయానా, సెయింట్ కిట్స్ అండ్ నివీస్, ట్రిడినాడ్ అండ్ టొబాకో దేశాల్లో అండర్-19 ప్రపంచ కప్‌ను నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది ఐసీసీ.

ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సర్ వీవిన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియంలో మొదటి సెమీస్, కూలీడ్జ్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి 5న సర్ వీవిన్ రిచర్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది... 2020 జనవరిలో సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్‌ కప్ టోర్నీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి, మొట్టమొదటి సారి యువ ప్రపంచ కప్ టైటిల్ సాధించింది బంగ్లాదేశ్.

వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకి కుదించారు. 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన బంగ్లా, 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది...

ఐసీసీ ఈవెంట్‌లో బంగ్లాదేశ్‌కి ఇదే మొట్టమొదటి టైటిల్. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, టీమిండియా క్రికెటర్లు తగువులాడుకోవడం అప్పట్లో పెనుదుమారం రేపింది.

2020 అండర్-19 ప్రపంచకప్ ఆడిన జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేయగా టోర్నీలో 400+ పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’గా నిలిచిన యశస్వి జైస్వాల్, రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అండర్-19 వరల్డ్ కప్ 2020 టోర్నీలో 17 వికెట్లు తీసిన రవి భిష్ణోయ్, ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు...

click me!