ఇంగ్లాండ్ పనిపట్టిన భారత బౌలర్లు.. రాజ్ బవకు ఐదు వికెట్లు.. ఐదో ప్రపంచకప్ నెగ్గేందుకు టీమిండియాకు ఛాన్స్..!

Published : Feb 05, 2022, 10:48 PM IST
ఇంగ్లాండ్ పనిపట్టిన భారత బౌలర్లు.. రాజ్ బవకు ఐదు వికెట్లు.. ఐదో ప్రపంచకప్ నెగ్గేందుకు టీమిండియాకు ఛాన్స్..!

సారాంశం

ICC Under-19 World cup Final 2022:  యువ భారత బౌలర్లు అదరగొట్టారు.  పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై నిప్పులు చెరిగే బంతులు విసిరి ఇంగ్లాండ్ పనిపట్టారు.  ఇంగ్లీష్ జట్టును 200 పరుగులలోపే కట్టడి చేసి ఐదో ప్రపంచకప్ గెలవడానికి బాటలు వేశారు. ఇక భారమంతా బ్యాటర్లదే..

ఐదో ప్రపంచకప్ వేటలో  ఉన్న భారత్ ఆ దిశగా ముందుకు సాగుతున్నది.  ఇంగ్లాండ్ తో అంటిగ్వా (వెస్టిండీస్) వేదికగా జరుగుతున్న అండర్-19   ప్రపంచకప్ లో భారత బౌలర్లు  దుమ్ములేపారు. పేస్ ద్వయం  రవికుమార్, రాజ్ బవలు  ఇంగ్లాండ్ బ్యాటర్ల పనిపట్టారు.  ఆదిలోనే రవికుమార్ దెబ్బకొట్టగా.. తర్వాత  రాజ్ బవ దానిని కొనసాగించాడు. పేస్ పై లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు. వీళ్లిద్దరి విజృంభణతో ఇంగ్లాండ్.. 44.5ఓవర్లలో 189 పరుగులే చేసి ఆలౌటైంది.  రాజ్ బవ ఐదు వికెట్లు దక్కాయి.  అండర్-19 ప్రపంచకప్ ను  ఐదో సారి దక్కించుకోవాలంటే భారత్ 190 పరుగులు చేస్తే చాలు.. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా లెఫ్టార్ట్ సీమర్ రవికుమార్..  మరోసారి తన  స్వింగ్ తో మాయ చేశాడు. స్కోరుబోర్డు పై  నాలుగు పరుగులు చేరగానే  రెండో ఓవర్లో  రవికుమార్.. బెతెల్ (2) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  ఆ తర్వాత కొద్దిసేపటికే  కెప్టెన్ టామ్ ప్రీస్ట్ (0) ను బౌల్డ్  చేశాడు.  ఇక క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన మరో ఓపెనర్ జార్జ్ థామస్ (27) ను రాజ్ బవ పెవిలియన్ బాట పట్టించాడు. 

 

పది ఓవర్లు ముగిసేసరికే ఇంగ్లాండ్.. 37 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన జేమ్స్ (95) నిలకడగా ఆడాడు. కానీ అతడికి అండగా నిలిచేవారే కరువయ్యారు.  థామస్ వికెట్ తీసిన ఉత్సాహంలో  రాజ్ బవ మరింత  రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో లక్స్టన్ (4), జార్జ్ బెల్ (4) ను పెవిలియన్ కు పంపాడు. 

క్రమంగా వికెట్లు పడుతున్నా జేమ్స్ మాత్రం ఆచితూచి ఆడాడు.  వికెట్ కీపర్ అలెక్స్ హార్టన్ (10) ను  స్పిన్నర్ కౌశల్ తాంబే  ఔట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన  జేమ్స్ సీల్స్ (34 నాటౌట్) తో కలిసి జేమ్స్.. స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు  93 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సెంచరీ కి చేరువైన జేమ్స్ ను రవికుమార్ బోల్తా కొట్టించాడు.   దీంతో 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 

జేమ్స్ నిష్క్రమణ తర్వాత వచ్చిన థామస్ (0), జోషువా (1) లు కూడా పెద్దగా ప్రతిఘటించలేదు.  దీంతో 44.5 ఓవర్లలో ఇంగ్లాండ్.. 189 పరుగులకు ఆలౌటైంది.  రాజ్ బవ.. 9.5 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.  మరో సీమర్ రవికుమార్.. 9 ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.  స్పిన్నర్ కౌశల్ తాంబే కు ఒక వికెట్ దక్కింది. 

కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ శుభారంభం దక్కలేదు. ఫామ్ లో ఉన్న రఘువంశీ (0) డకౌట్ గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 1 వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (4*), షేక్ రషీద్ (10*) క్రీజులోొ ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?