
విండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా మరికొద్దిసేపట్లో యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. అంటిగ్వా లోని సర్ వివిన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై ఓల్టేజీ మ్యాచులో టీమిండియానే ఫేవరేట్. కానీ ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ ప్రయాణాన్ని చూస్తే అదేం లైట్ తీసుకోవాల్సిన జట్టు ఎంత మాత్రమూ కాదు. 22 ఏండ్ల తర్వాత అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరిన ఇంగ్లీష్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తున్నది. టామ్ ప్రీస్ట్ సారథ్యంలోని ఆ జట్టుకు ప్రపంచకప్ లో ఇది రెండో ఫైనల్ కాగా.. భారత్ కు ఎనిమిదో ఫైనల్. వరుసగా నాలుగో ఫైనల్.
2016 అండర్-19 ప్రపంచకప్ లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైన భారత జట్టు.. అప్పట్నుంచి ప్రతి ఫైనల్స్ కు చేరుతున్నది. 2016, 2018, 2020 ల తర్వాత భారత్ కు ఇది వరుసగా నాలుగో ఫైనల్స్. మొత్తంగా ఎనిమిదో ఫైనల్స్. ఈ నేపథ్యంలో గత ఏడు ఫైనల్స్ లో భారత్ ఎలా ఆడిందో ఇక్కడ చూద్దాం..
అంతకంటే ముందు...
1988 లో తొలి సారి జూనియర్ ప్రపంచకప్ ను ప్రవేశపెట్టింది ఐసీసీ. తొలి అండర్-19 ప్రపంచకప్ ను ఆసీస్ గెలుచుకుంది. కానీ పలు కారణాల రీత్యా ఆ తర్వాత 1998 దాకా రెండో ప్రపంచకప్ జరుగలేదు. 1988 ప్రపంచకప్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఇక ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి ఈ మెగా టోర్నీలో భారత్ ఎంట్రీ ఇచ్చి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 2000లో నిర్వహించిన అండర్-19 ప్రపంచకప్ విజేత భారత్.
2000.. భారత్ విజేత..
అండర్-19 ప్రపంచకప్ ను భారత్ తొలి సారిగా 2000లలో సాధించింది. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సారథ్యంలోని యువ భారత్.. ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తు చేసి తొలి జూనియర్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో యువరాజ్, మహ్మద్ కైఫ్ లు తర్వాత సీనియర్ జట్టుకు కూడా చాలా కాలం పాటు ఆడారు.
2006.. పాక్ చేతిలో ఓటమి..
ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్ లో తొలి కప్ నెగ్గిన భారత్ తర్వాత 2006లో ఫైనల్స్ కు చేరింది. కానీ భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అప్పటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు ఇప్పుడు భారత సీనియర్ జట్టు సభ్యులు.
2008.. కింగ్ అరంగ్రేటం..
2006 లో ఓడిన భారత్.. 2008లో మాత్రం గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి సారథ్యంలోని యువ భారత జట్టు.. సౌతాఫ్రికాను చిత్తుచేసి విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత భారత సీనియర్ జట్టులోకి అరంగ్రేటం చేసిన కింగ్ కోహ్లి.. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.
2012.. ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో..
2008 తర్వాత మరుసటి ఏడాది భారత్ ఫైనల్ కు చేరలేదు. కానీ ఆ తర్వాతి ఎడిషన్ (2012) లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని భారత కుర్రాళ్లు ఆస్ట్రేలియాపై విజయం సాధించి భారత్ కు మూడో అండర్ -19 ప్రపంచకప్ అందించారు.
2016.. తృటిలో ఓటమి..
ఇషాన్ కిషన్ నాయకుడిగా వ్యవహరించిన ఈ ప్రపంచకప్ లో భారత్.. వెస్టిండీస్ చేతిలో ఓడింది. ఆఖరు ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఆ ఫైనల్స్ లో భారత్ కు పరాజయం తప్పలేదు. ఆ జట్టులోని రిషభ్ పంత్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్ లు ఇప్పుడు భారత భావి తారలుగా ఎదుగుతున్నారు.
2018.. రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశకత్వంలో..
2016 ప్రపంచకప్ ఓడినా ఆ తర్వాత జరిగిన ఎడిషన్ లో భారత్ అద్బుతంగా ఆడింది. మిస్టర్ డిపెండెబుల్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్న జట్టుకు పృథ్వీ షా సారథి. మెన్ ఇన్ బ్లూ.. తుది పోరులో ఆసీస్ ను ఓడించి భారత్ కు నాలుగో ప్రపంచకప్ ను అందించారు.
2020.. బంగ్లాదేశ్ చేతిలో పరాజయం..
గత ఎడిషన్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ కు భంగపాటు తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 177 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లా తొలిసారి అండర్-19 ప్రపంచకప్ నెగ్గింది.
ఇదిలాఉండగా ఈ సారి కూడా భారత జట్టు ప్రయాణమేమీ సాఫీగా సాగలేదు. లీగ్ దశలో ఒక మ్యాచ్ ఆడిన తర్వాత భారత జట్టు సారథి యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కానీ కీలకమైన క్వార్టర్స్ ముందు వాళ్లంతా కోలుకున్నారు. క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ ను, సెమీస్ లో ఆసీస్ ను ఓడించింది టీమిండియా. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మెరుగ్గా రాణిస్తున్న భారత జట్టు.. ఇంగ్లాండ్ తో పోల్చితే బలంగానే ఉంది. మరో విరాట్ కోహ్లిగా భావిస్తున్న యశ్ ధుల్.. మరి ఆ దిశగా ముందడుగు వేయాలంలే ఈ ఫైనల్ కీలకం కానున్నది.