T20 worldcup: బ్యాటింగ్ లో గర్జించిన బంగ్లా పులులు.. తేలిపోయిన శ్రీలంక బౌలర్లు.. లంకేయుల ముందు భారీ టార్గెట్

By team teluguFirst Published Oct 24, 2021, 5:28 PM IST
Highlights

Bangladesh vs Srilanka: శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పోరులో టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది. ఆ  జట్టు ఓపెనర్ మహ్మద్ నయీంకు సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్  తోడవడంతో ఆ జట్టు శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచింది.  

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 WorldCup 2021) లో భాగంగా గ్రూప్-1 లో తలపడుతున్న శ్రీలంక , బంగ్లాదేశ్ (Srilanka vs Bangladesh) మధ్య జరుగుతున్న పోరులో టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది. ఆ  జట్టు ఓపెనర్ మహ్మద్ నయీం (mohammad naim) కు సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (Mushfiqur rahim) తోడవడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన బంగ్లాదేశ్.. శ్రీలంక ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక (Srilanka)కు నిరాశే ఎదురైంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై బంగ్లా (Bangladesh) ఓపెనర్లు రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా లిటన్ దాస్ (16 బంతుల్లో 16), మహ్మద్ నయీం (52 బంతుల్లో 62) బంగ్లాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఐదు ఓవర్లలోనే బంగ్లా స్కోరు 40 పరుగులు దాటింది. 

ఓపెనర్లిద్దరూ కుదురుకుంటున్నారనుకుంటున్న తరుణంలో లిటన్ దాస్ ను లహిరు కుమార ఔట్ చేశాడు. అతడు ఔటయ్యాక  వచ్చిన ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్(10) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 7 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి టచ్ లో ఉన్నట్టే కనిపించిన షకిబ్ ను కరుణరత్నే బౌల్డ్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటంలో షకిబ్ అంచనా తప్పైంది. బ్యాట్ ఎడ్జ్ కు తగిలిన బంతి వికెట్లను గిరాటేసింది. 

షకీబ్ ఔటవ్వడంతో బంగ్లా.. 8 ఓవర్లలోపే రెండు కీలక వికెట్ల కోల్పోయి 58 పరుగులు చేసింది. ఆ సమయంలో ముష్ఫీకర్ రహీమ్ (37 బంతుల్లో 57.. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో)జత కలిసిన నయీమ్  పంథా మార్చాడు. మరోపక్క రహీమ్ విజృంభిస్తుండటంతో సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. 

 

What a day to get your first-ever fifty 👏 smashed the ball all around Sharjah today 🔥

— ESPNcricinfo (@ESPNcricinfo)

ఈ క్రమంలో 13 వ ఓవర్ చివరిబంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ చేశాక నయీం ఎక్కువసేపు నిలువలేదు. 17 వ ఓవర్ వేసిన బినుర ఫెర్నాండో బౌలింగ్ లో షాట్ కు యత్నించి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నయీమ్ ఔటయ్యాక వచ్చిన అఫిఫ్(7)ను లహిరు కుమార రనౌట్ చేశాడు. మరో పక్క రహీమ్ కూడా 18వ ఓవర్లో సింగిల్ తీసి టీ20లలో ఆరో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక చివర్లో వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా (5 బంతుల్లో 10) చేశాడు. ఫలితంగా బంగ్లా.. 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.  

 

Bangladesh set a target of 172 against Sri Lanka. pic.twitter.com/pKuL1EOkld

— Bangladesh Cricket (@BCBtigers)

శ్రీలకం బౌలర్లలో చమిర కరుణరత్నే ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన కరుణరత్నె.. 12 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఫెర్నాండో కూడా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ దుష్మంత చమీర (41) భారీగా పరుగులిచ్చుకున్నాడు. 

 

click me!