T20 World cup:ఏంటి ఫోర్లు కొట్టడం మరిచారా..? బౌండరీ రావడానికి 70 బంతులా.? టీమిండియా చెత్త ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం

By team teluguFirst Published Nov 1, 2021, 10:52 AM IST
Highlights

India vs Newzealand: రాహుల్ ఔటయ్యాక.. 7-15 వ ఓవర్ల మధ్య భారత బ్యాటర్లు బౌండరీ ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయారు. పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 70 బంతుల దాకా మన ఘనత వహించిన ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఒక్క బౌండరీ కొట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు టీమిండియా ఆటతీరు ఎలా ఉందో..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ లో న్యూజిలాండ్(Newzealand) తో జరిగిన మ్యాచ్ లో భారత్ (India) చెత్త ఆటతో సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఏదైనా అద్భుతాలు, అసాధ్యాలు జరిగితే తప్ప టోర్నీలో భారత్ కథ ముగిసినట్లే. ఆటలో గెలుపోటములు సహజమే అని వేదాంతాలు చెప్పుకున్నా.. భారత ఆటగాళ్ల మరి ఇంత దారుణమైన ఆటతీరును మాత్రం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  టీమిండియా (Team India).. తొలి పవర్ ప్లేలో ముగిసేసరికి అనుకున్నంత స్థాయిలో విజృంభించకపోయినా.. ఫర్వాలేదనే స్థితిలోనే ఉంది టీమిండియా. క్రీజులో కెఎల్ రాహుల్ (KL Rahul),  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఉన్నారు. కానీ వరుస ఓవర్లలో వాళ్లిద్దరూ ఔటయ్యారు. రాహుల్ ఔటయ్యాక.. 7 వ ఓవర్ నుంచి 15 వ ఓవర్ దాకా భారత బ్యాటర్లు బౌండరీ ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయారు. పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 70 బంతుల దాకా మన ప్రపంచ స్థాయి ఆటగాళ్లు బౌండరీ కొట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు భారత బ్యాటర్లు ఎంతగా ఇబ్బంది పడ్డారో.. 

భారత ఇన్నింగ్స్ లో మొత్తం 8 ఫోర్లు, రెండు సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. ఇవి ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ ఒకటి కొట్టగా.. ఆఖరి ఓవర్లో రవీంద్ర జడేజా మరొకటి బాదాడు. ఇక ఫోర్ల విషయానికొస్తే.. బంతిని అవలీలగా బౌండరీ  లైన్ దాటించే బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత బ్యాటర్లు.. 7-15 ఓవర్ల మధ్య (71 బంతుల పాటు) ఒక్క ఫోర్ కొట్టలేదంటే నమ్ముతారా..? కానీ నమ్మాలి. నిన్నటి మ్యాచ్ లో జరిగిందదే. 

ఈ కృతువులో కివీస్ బౌలర్లు పూర్తిగా సఫలమయ్యారు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కివీస్ ఏకంగా 54 డాట్ బాల్స్ వేసిందంటేనే అర్థమవుతోంది.. న్యూజిలాండ్ భారత్ ను ఎంత కట్టడి  చేసిందో అని.. ముఖ్యంగా స్పిన్ ను బాగా ఆడే పేరున్న భారత పులులు.. కివీస్ స్పిన్నర్లు ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ ల ధాటికి  విలవిల్లాడారు. ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు.. రోహిత్, విరాట్ (Virat Kohli) లు ఇష్ సోధికే వికెట్ సమర్పించుకున్నారు. 

టిమ్ సౌథీ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి కెఎల్ రాహుల్ ఫోర్ కొట్టాడు.  ఆ తర్వాత  17 వ ఓవర్ చివరి బంతి దాకా మన  యోధులు ఫోర్ కొట్టలేదు. ఫోర్ కొట్టలేదు సరికదా.. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అసలు క్రీజులోకి వచ్చామా..? వెళ్లామా..? అంతకుమించి మనకు సంబంధమే లేదు అన్నచందంగా మారింది నిన్న టీమిండియా ఆట.  టీ20  అనుభవమే లేని.. అసలు క్రికెట్ లో ఓనమాలు దిద్దే జట్లు సైతం ఈ టోర్నీలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న చోట ఘనత వహించిన భారత బ్యాటర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు. ధనాధన్ ఆటగా పేరున్న టీ20లలో  ఇంతటి దారుణ ప్రదర్శన చాలా అరుదు. 

టీమిండియా ప్రదర్శన చూసినవాళ్లంతా.. నిన్నటి న్యూజిలాండ్ మ్యాచ్ కంటే  మనోళ్లు పాకిస్థాన్ (Pakistan) పై కాస్తో కూస్తో ప్రతిఘటించేలా ఆడారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు.. టీ20 క్రికెట్ లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన యోధుల జాబితాల్లో ఇద్దరు వీరులు మనోళ్లేనండోయ్.. వాళ్లే విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.  ఇక ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టే వీరుడు రిషభ్ పంత్.. బౌండరీ కాదు కదా..  కనీసం బంతని గాల్లోకి లేపే ప్రయత్నం కూడా చేయలేదు. 

click me!