
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, వరుస రెండు పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయగలిగారు... 111 పరుగుల టార్గెట్ లక్ష్యఛేదనను బుల్లెట్ వేగంతో ఆరంభించింది న్యూజిలాండ్. వరుణ్ చక్రవర్తి మొదటి ఓవర్‌లో 5 పరుగులు ఇవ్వగా, బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో 12 పరుగులు రాబ్టాడు మార్టిన్ గుప్టిల్...
17 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్...
Must Read: కీలక మ్యాచ్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలా... ధోనీ, టీమిండియాను ఏం చేయాలనుకుంటున్నావ్..
ఆ తర్వాత ఐదో ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి 2 పరుగులు మాత్రమే ఇవ్వగా... పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా ఓ సిక్స్, రెండు ఫోర్లతో 14 పరుగులు సమర్పించాడు...35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే కేన్ విలియంసన్‌తో కలిసి 54 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు మిచెల్.
కేన్ విలియంసన్ 31 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా 14.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది కివీస్...అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మొదటి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే రాగా మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించింది భారత జట్టు. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా పంపించాలనుకునే నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇషాన్ కిషన్ 8 బంతుల్లో ఓ ఫోర్ తో 4 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ఇషాన్ కిషన్ అవుటైన తర్వాతి బంతికే భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ... అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రోహిత్ శర్మ చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను ఆడమ్ మిల్నే నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్‌తో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు...16 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో ఏదీ అద్భుతమైన బౌలింగ్ కారణంగా పడింది కాదు. అందరూ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించి, ఫీల్డర్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరినవాళ్లే.
ఆదుకుంటాడని అనుకున్న విరాట్ కోహ్లీ 17 బంతులాడి 9 పరుగులు చేసి ఇష్ సోదీ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీని మూడోసారి అవుట్ చేశాడు ఇష్ సోదీ...
19 బంతుల్లో 12 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 7వ ఓవర్ తర్వాత 17వ ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు భారత బ్యాట్స్‌మెన్...
టీ20ల్లో టీమిండియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు ఇష్ సోదీ. 24 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాకి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2016 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత జట్టు. రవీంద్ర జడేజా 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేయగా భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి 36 బంతులు ఎదుర్కొన్న ఒక్క బౌండరీ చేయలేకపోయారు.