T20 Worldcup: ఐదు నిమిషాలకు మించి ఇంగ్లిష్ అంటే మనతోని కాదు.. అఫ్ఘాన్ కెప్టెన్ నబీ ఫన్నీ కామెంట్స్

By team teluguFirst Published Oct 27, 2021, 7:48 PM IST
Highlights

ICC T20 Worldcup2021: ప్రపంచకప్ లో నేరుగా సూపర్-12కు అర్హత సాధించిన అఫ్ఘాన్.. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)లో ఆడటానికి వచ్చిన జట్లన్నింటిది కప్పు కోసం పోరాటం. కానీ అఫ్ఘానిస్థాన్ (Afghanistan) క్రికెటర్లది అలా కాదు. వారిది అస్థిత్వ పోరాటం. 20 ఏండ్ల తర్వాత అఫ్ఘాన్ లో మళ్లీ తాలిబన్లు (Talibans) రాజ్యమేలుతున్నారు. అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకులీడుస్తున్నారు. ముప్పు ఏ వైపు నుంచి ఏ విధంగా వస్తుందో ఊహించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మిగతా జట్లు, ఆ జట్ల క్రికెటర్లు ఎలా ఉండేవారో గానీ అఫ్ఘాన్ క్రికెటర్లు (Afghan Cricketers) మాత్రం ఆ బాధను పంటి బిగువన భరిస్తున్నారు. టోర్నీ గెలిచే సామర్థ్యం దానికి ఉందా..? అన్న ప్రశ్న పక్కనబెడితే తనదైన రోజున సంచలనాలు సృష్టించడంలో వాళ్లు సమర్థులే. 

ఇక ఐసీసీ టీ20 (ICC T20 WC) టోర్నీకి డైరెక్ట్ గా అర్హత సాధించిన జట్లలో అఫ్ఘాన్ ఒకటి. బంగ్లాదేశ్, శ్రీలంక ల మాదిరి అది క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు కూడా ఆడలేదు. ప్రపంచకప్ లో నేరుగా సూపర్-12కు అర్హత సాధించి తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ (Scotland) ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ (Mohammad Nabi) మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశానికి వచ్చిన నబీ.. ‘ఇది (ప్రెస్ కాన్ఫరెన్స్) చాలా కష్టమైన పని. ఎన్ని ప్రశ్నలున్నాయి.  మరి నా ఇంగ్లిష్ 5 నిమిషాల్లో ఖతమైపోతుంది’ అంటూ అక్కడున్నవారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

"5 mint main meri English Khatam hojye gi"😂 pic.twitter.com/ugbmHFLeL4

— Abdul Wahab (@abdulwahabdr02)

ఇంకా అతడు మాట్లాడుతూ.. ‘టోర్నీ ప్రారంభంలోనే గెలవడం ముఖ్యం. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలనేది మా ప్రణాళికలో భాగం. అందుకు తగ్గట్టుగానే మా బ్యాటర్లంతా అద్భుతంగా రాణించారు. వారితో పాటు మిడిలార్డర్ కూడా బాగా ఆడింది. ఇక మా స్పిన్నర్లు మంచి బంతులు విసిరి వికెట్లు పడగొట్టారు. రషీద్, ముజీబ్ రూపంలో మాకు నాణ్యమైన స్పిన్నర్లు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 

సోమవారం  స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అఫ్ఘానిస్థాన్..  తొలుత బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. ఆ జట్టులో నజీబుల్లా జద్రాన్ 34 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. ముజీబ్ 5 వికెట్లతో స్కాట్లాండ్ ను 60 పరుగులకే కట్టడి చేసిన విషయం తెలిసిందే.  

click me!