
ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) 2021 లో భాగంగా అబుదాబిలో జరిగిన బంగ్లాదేశ్-ఇంగ్లండ్ (Bangladesh vs England) మ్యాచ్ లో బంగ్లా పులులు తేలిపోయారు. గ్రూప్-1లో భాగంగా ఈ రెండు జట్లు తలపడగా.. ఇంగ్లండ్ (England) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని.. 14.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేసన్ రాయ్ (Jason Roy) దంచి కొట్టాడు. మలన్, బట్లర్ రాణించారు.
అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ (Bangladesh).. నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. అనంతరం 125 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు జేసన్ రాయ్ (38 బంతుల్లో 61.. 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (18) శుభారంభాన్నిచ్చారు.
తొలి ఓవర్ మొదటి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టిన బట్లర్.. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. షకిబ్ వేసిన మూడో ఓవర్లో బట్లర్ సిక్సర్ కొట్టాడు. కానీ ఐదో ఓవర్లో నసుమ్ అహ్మద్ వేసిన చివరిబంతికి భారీ షాట్ ఆడబోయి లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నయీంకు చిక్కాడు.
అనంతరం మలన్ (25 బంతుల్లో 28 నాటౌట్) తో జతకలిసిన రాయ్.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. నసుమ్ వేసిన 12 వ ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. కాీన తర్వాత బంతికి ఔటయ్యాడు. కానీ అప్పటికే ఇంగ్లండ్ విజయానికి చేరువలో ఉంది.
12 ఓవర్లకే ఆ జట్టు 100 పరుగులు దాటింది. మలన్ కూడా మూడు ఫోర్లు బాది టార్గెట్ ను మరింత ఈజీ చేశాడు. రాయ్ ఔటయ్యాక వచ్చిన బెయిర్ స్టో (8) తో కలిసి విజయాన్ని పూర్తి చేశాడు.
బంగ్లా బౌలర్లు తేలిపోయారు. ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న షకిబ్ ఉల్ హసన్.. 3 ఓవర్లు వేసిన 24 పరుగులిచ్చాడు. ఒక వికెట్ కూడా పడలేదు. ముస్తాఫిజుర్ కూడా ఆకట్టుకోలేదు. ఇస్లాం, అహ్మద్ లకు చెరో వికెట్ దక్కింది. జేసన్ రాయ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా, ఇంగ్లండ్ కు ఇది రెండో విజయం కాగా.. బంగ్లా కు వరుసగా రెండో పరాజయం. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తర్వాత మ్యాచ్ లలో బంగ్లా.. విండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లన్నీ గెలిస్తేనే బంగ్లాకు సెమీస్ వెళ్లే అవకాశం దక్కుతుంది.