T20 World Cup: 16 దేశాలు.. 45 మ్యాచ్ లు.. నేటి నుంచే నెల రోజుల పొట్టి క్రికెట్ పండుగ షురూ..

By team teluguFirst Published Oct 17, 2021, 2:42 PM IST
Highlights

ICC T20 World Cup: మునుపెన్నడూ  లేని విధంగా రెండు దశల్లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఐపీఎల్.. రెండ్రోజుల క్రితమే విజయవంతంగా ముగిసింది. అయితే క్రికెట్ అభిమానులకు మరో పండుగ. వరుసగా రెండు సార్లు వాయిదా పడ్డ టీ20 ప్రపంచకప్ నేటి నుంచి యూఏఈలో ఆరంభం కానున్నది. 

దాదాపు నెల రోజుల పాటు ఐపీఎల్ (IPL)ను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు మరో పండుగ నేటి నుంచి మొదలుకానున్నది. ఐపీఎల్ కు మించిన మెరుపులు, దానిని తలదన్నే హంగులు, ఆర్భాటాలు.. రెండు దేశాల మధ్య విజయం కోసం కొదమసింహాల్లా పోరాడే  క్రికెట్ వీరుల  పోరాటాలు.. దాయాదుల మధ్య సమరాలు.. ఒళ్లు గగుర్పొడిచే  ఫీల్డింగ్ విన్యాసాలు.. మెరుపు ఇన్నింగ్స్.. అబ్బో..! ఆ జాతరను తనివి తీరా అనుభవించాల్సిందే. అదే టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup).

ఏడో టీ20 ప్రపంచకప్ కోసం సర్వం సిద్ధమైంది. యూఏఈ (UAE) వేదికగా నేటి నుంచి నవంబర్ 14 దాకా జరిగే ఈ మ్యాచ్ లను ఓమన్ (Oman), దుబాయ్ (Dubai), షార్జా (Sharjah)లలో నిర్వహించనున్నారు. కొవిడ్-19  నేపథ్యంలో స్టేడియానికి 70 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ లు వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు (Covid Protocall) పాటించాలి. 

ఇది కూడా చదవండి: మరొకరి భార్యను పెళ్లి చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగిన కుంబ్లే.. జంబో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా..?

16 దేశాలు పోటీ పడుతున్న ఈ పొట్టి ప్రపంచకప్ లో నేటి నుంచే క్వాలిఫయింగ్ రౌండ్ (Qualifying Round) ప్రారంభం కాబోతుంది. సూపర్-12 (Super-12) బెర్తుల కోసం అర్హత సాధించని జట్లు ఆదివారం నుంచి తాడో పేడో తేల్చుకోనునున్నాయి.  ఇప్పటికే  అర్హత సాధించిన టాప్-8 జట్లు వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడనున్నాయి. 

షెడ్యూల్ ఇలా.. 

క్వాలిఫయింగ్ రౌండ్ లో పాల్గొనే 8 దేశాలను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉండగా.. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఓమన్ ఉన్నాయి. నేటి నుంచి ఆరంభం కాబోయే ఈ మెగా ఈవెంట్ లతో ఆతిథ్య ఓమన్ తో పపువా న్యూ గినియా తలపడనున్నది. మధ్యహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానున్నది. ఇక సాయంత్రం 7.30 గంటలకు బంగ్లాదేశ్ తో స్కాట్లాండ్ పోటీ పడనున్నది. 

క్వాలిఫయింగ్ రౌండ్ లో టాప్-2 లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 కు అర్హత సాధిస్తాయి. ఇవి టాప్-8 జట్లతో తలపడుతాయి. దీంతో సూపర్-12 లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇందులోనూ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. గ్రూప్-1 లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉండగా.. గ్రూప్-2 లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి. వీటికి క్వాలిఫయింగ్ రౌండ్ లో అర్హత సాధించే ఏ1, ఏ2, బీ1, బీ2 జత కలుస్తాయి. సూపర్-12లో ప్రతి జట్లు గ్రూపులోని అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. 

ఇది కూడా చదవండి:T20 World Cup: అతడుంటే చాలు.. కప్ మాదే..! ధోని నియామకంపై భారత కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

గ్రూపుల్లో టాప్-2 లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. గెలిచిన మ్యాచ్ కు 2 పాయింట్లు, టై అయితే 1 పాయింట్ ఇస్తారు. టై అయితే సూపర్ ఓవర్ కూడా ఉంది. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకుంటే మ్యాచ్ టై గా ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. లీగ్ మ్యాచుల్లో లేకున్నా.. సెమీస్, ఫైనల్స్ కు మాత్రం రిజర్వ్ డే ఉంది. ఈ ప్రపంచకప్ లో తొలిసారి డీఆర్ఎస్ ను కూడా వాడనున్నారు. ప్రతి జట్టు ఇన్నింగ్స్ కు రెండు రివ్యూలు తీసుకోవచ్చు. కొవిడ్-19 తర్వాత జరుగుతున్న అతిపెద్ద క్రికెట్ టోర్నీ ఇదే. టోక్యో ఒలింపిక్స్ ఇచ్చిన స్ఫూర్తితో దీనిని కూడా విజయవంతంగా నిర్వహించాలని ఐసీసీ దృఢ సంకల్పంతో ఉంది. 

ఎప్పటిదాకా అంటే..

నేటి నుంచి మొదలుకానున్న అర్హత రౌండ్ మ్యాచ్ లు ఈనెల 22 వరకు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 23 నుంచి సూపర్-12 దశ మొదలుకానుంది. ఇది నవంబర్ 8 దాకా ఉంటుంది. ఇక నవంబర్ 10న తొలి సెమీఫైనల్.. 11న రెండో సెమీస్ జరుగుతాయి. నవంబర్ 14న దుబాయ్ లో జరిగే ఫైనల్ తో టోర్నీ అధికారికంగా ముగుస్తుంది. 

వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగే వేదికలు:

అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్ (మస్కట్): ఓమన్ రాజధాని మస్కట్ లో ఉన్న ఈ స్టేడియం కెపాసిటీ 20 వేలు.  ఈ గ్రౌండ్ ను 2019లో ప్రారంభించారు.  మొదటి రౌండ్ లో భాగంగా ఇక్కడ ఆరు మ్యాచ్ లు జరుగనున్నవి. 
షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం (అబుదాబి): 2004లో దీనిని నిర్మించారు. సీటింగ్ కెపాసిటీ 20 వేలు. 3 అర్హత రౌండ్ మ్యాచ్ లతో పాటు 10 సూపర్-12 మ్యాచ్ లు ఇక్కడ జరుగనున్నాయి.
షార్జా క్రికెట్ స్టేడియం షార్జా (UAE): షార్జాలో ఉన్న దీనిని 1982లో నిర్మించారు. 1984 ఏప్రిల్ లో ఆసియా కప్ సందర్భంగా ప్రారంభ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. కొన్నేళ్లుగా స్టేడియం చాలా మెరుగుపడింది. ఈ స్టేడియంలో, 17 వేల మందికి సీటింగ్ కెపాసిటీ ఉంది. షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రపంచకప్‌లో 11 (2 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, 9 సూపర్-12 మ్యాచ్ లు) జరుగుతాయి.


దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం:  దుబాయ్ లో ఉన్న ఈ స్టేడియాన్ని 2009లో నిర్మించారు. సీటింగ్ కెపాసిటీ 25 వేలు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఈ స్టేడియంలో 12 మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీస్, ఫైనల్స్ కూడా ఈ వేదికలోనే జరుగుతాయి. 

click me!