MS Dhoni: అలా చేయాల్సి వస్తే మొదటి పేరు ధోనిదే.. చెన్నైలో కెప్టెన్ కూల్ భవితవ్యంపై తేల్చేసిన యాజమాన్యం

By team teluguFirst Published Oct 17, 2021, 12:40 PM IST
Highlights

MS Dhoni: భారత్ లో  అతి పెద్ద క్రీడా జాతరగా గుర్తింపుపొందిన ఐపీఎల్  2021 సీజన్ ముగిసింది. వచ్చే సీజన్ లో రెండు కొత్త జట్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్ ధోని భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఐపీఎల్ (IPL 14) సీజన్ ముగిసింది. దసరా నాడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) మధ్య జరిగిన ఫైనల్  పోరులో చెన్నై జట్టు విజయం సాధించి నాలుగో టైటిల్ తన ఖాతాలో వేసుకుంది.  ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ లో ధోని(MS Dhoni) భవితవ్యం ఏమిటి..? అన్న చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై చెన్నై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. 

ఐపీఎల్ ట్రోఫీ సందర్భంగా కామెంటేటర్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు ధోని సమాధానం చెబుతూ.. ‘వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించే విషయంపై నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. నేను చెన్నైలోనే కొనసాగుతానా..? లేదా..? అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారుచేయడం ముఖ్యం. సూటిగా చెప్పాలంటే మరో 10 ఏండ్ల వరకు జట్టును నడిపించగల బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా గురించి గొప్పలు చెబుతున్నారని గానీ నేనిప్పుడు ఈ జట్టును వీడితే కదా..’ అని తనదైన శైలిలో చెప్పాడు. 

ఇది కూడా చదవండి: మరొకరి భార్యను పెళ్లి చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగిన కుంబ్లే.. జంబో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా..?

కాగా 2022 ఐపీఎల్ సీజన్ కోసం త్వరలోనే మెగా వేలం (IPL 2022 Auction) జరుగనున్నది. ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం (IPL Retention Policy) ప్రకారం.. ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు ఇద్దరు ఆటగాళ్లను మాత్రం అట్టిపెట్టుకోవచ్చు. అయితే ఇది ఇద్దరా..? లేక సంఖ్యను మార్చుతారా..? అనేదానిమీద స్పష్టత లేదు. 

ఇదిలాఉండగా.. ఇదే విషయమై సీఎస్కే ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘వేలంలో ఫస్ట్ రిటెన్షన్ కార్డు ఉపయోగించేది ధోని మీదే. ఈ జట్టుకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా ఉన్న ధోనిని నిలుపుకుంటాం. ఎంతమందిని నిలుపుకోవాలనే దానిమీద బీసీసీఐ (BCCI)ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈ ఓడ (సీఎస్కే)కు కెప్టెన్ కూల్ అవసరం ఎంతో ఉంది. అతడు వచ్చే ఏడాది మాతోనే ఉంటాడు’ అని హామీ ఇచ్చాడు. 

ఇది కూడా చదవండి: IPL2021 CSK vs KKR: ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వీరులు వీళ్లే.. టాప్ లో విరాట్ కోహ్లి

ఐపీఎల్ ఫైనల్స్ లో అదరగొట్టిన చెన్నై.. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించి నాలుగో ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్ లో అత్యంత దారుణంగా విఫలమై కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరని ఆ జట్టు అనూహ్య స్థాయిలో పుంజుకుని ఈసారి ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం. దీనిపై ధోని స్పందిస్తూ.. ‘ప్రతీ ఫైనల్ మాకు ప్రత్యేకమే. ఫైనల్స్ లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. కిందపడ్డ ప్రతిసారి మేలు అత్యున్నత స్థాయిలో కోలుకుంటున్నాం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతి మ్యాచ్ లో మాకు మ్యాచ్ విన్నర్ దొరికాడు. ఇక మేం ఎక్కడ ఆడినా చెన్నైలో ఆడినట్టే ఉంటుంది. మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు’ అని చెప్పాడు.

click me!