T20 World cup: కివీస్ తడబాటు.. రాణించిన నమీబియా బౌలర్లు.. ఎరాస్మస్ సేనపై ఆశగా చూస్తున్న భారత అభిమానులు

Published : Nov 05, 2021, 05:19 PM ISTUpdated : Nov 05, 2021, 05:23 PM IST
T20 World cup: కివీస్ తడబాటు.. రాణించిన నమీబియా బౌలర్లు.. ఎరాస్మస్ సేనపై ఆశగా చూస్తున్న భారత అభిమానులు

సారాంశం

New Zealand vs Namibia: నమీబియా ఆహ్వానం మేరకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్, నీషమ్ రాణించారు. 

టీ20  ప్రపంచకప్ (T20 World cup)లోని గ్రూప్-2 లో ఉన్న న్యూజిలాండ్-నమీబియా (New Zealand Vs Namibia) ల మధ్య షార్జా వేదికగా జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్న కివీస్.. నేటి మ్యాచ్ లో గెలవాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్ తో పాటు.. ఈనెల 7 న అఫ్గాన్ తో మ్యాచ్ లో గెలిస్తేనే ఆ జట్టు సెమీస్ చేరుకుంటుంది. కాగా.. టీ20 ఫార్మాట్ లో న్యూజిలాండ్.. నమీబియా (Namibia)తో తొలి సారి ఢీకొంటున్నది. నమీబియా ఆహ్వానం మేరకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్, నీషమ్ రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ (New zealand) కు గత మ్యాచ్ హీరో మార్టిన్ గప్తిల్ (18 బంతుల్లో 18), మిచెల్ (15 బంతుల్లో 19) శుభారంభాన్నే అందించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్కాల్ట్జ్ వేసిన  నాలుగో బంతిని సిక్సర్ బాదిన గప్తిల్ (martin guptill).. తర్వాత ట్రంపుల్మెన్ ఓవర్లో ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ డేవిడ్ వీస్ వేసిన ఐదో ఓవర్లో.. భారీ షాట్ కు యత్నించి మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ట్రంపుల్మాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ స్కోరు 36-1 గా ఉంది. 

ఆ  తర్వాత మిచెల్ కూడా రెండు ఫోర్లు కొట్టినా అతడూ ఎక్కువసేపు నిలువలేదు.  స్కాల్ట్జ్ వేసిన ఏడో ఓవర్లో వాన్ లింగెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఓపెనర్లు ఇద్దరూ త్వరగానే వెనుదిరిగినా.. కెప్టెన్ విలిమయ్సన్ (Kane Williamson) (25 బంతుల్లో 28.. 2 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ కాన్వే (18 బంతుల్లో 18) కాసేపు నిలబడ్డారు. 

డ్రింక్స్ తర్వాత లొఫ్టి ఈటన్ వేసిన 11 వ ఓవర్లో విలిమయ్సన్.. ఫోర్, సిక్సర్ కొట్టినా.. 13 వ ఓవర్ తొలి బంతికే నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ (Erasmus) బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత ఓవర్లోనే కాన్వే కూడా రనౌట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 87 గా ఉంది. 

 

విలియమ్సన్, కాన్వేల నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ (20 బంతుల్లో 37.. 1 ఫోర్, 3 సిక్సర్లు), జేమ్స్ నీషమ్ (22 బంతుల్లో 33.. 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. 17వ ఓవర్లో ఫిలిప్స్.. రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టగా ఆ తర్వాత ఓవర్లో ఫిలిప్స్ కూడా ఫోర్, సిక్స్ తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఆఖరు ఓవర్ వేసిన స్మిత్.. ఆరు వైడ్లతో పాటు సిక్సర్ తో 18 పరుగులు ఇచ్చాడు. ఫలితంగా కివీస్.. 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 73 పరుగులు చేయగలిగింది. 

నమీబియా బౌలర్లలో స్కాల్ట్జ్.. పొదుపుగా బౌలింగ్ చేయడమే గాక ఒకవికెట్ కూడా తీసుకున్నాడు. ట్రంపుల్మాన్ కట్టుదిట్టంగా బంతులువేసినా వికెట్ పడగొట్టలేదు.  సారథి ఎరాస్మస్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు తేలిపోయారు. 

కాగా ఈ  మ్యాచ్ లో న్యూజిలాండ్.. నమీబియాను 70 పరుగుల తేడాతో ఓడించాలి. అలా అయితే  కివీస్.. అఫ్గాన్ (Afghanistan) రన్ రేట్ ను సమానం చేస్తుంది. లేకుంటే ఈనెల 7 న జరిగే మ్యాచ్ లో ఏదైనా తేడా జరిగితే న్యూజిలాండ్ ఇంటి బాట పట్టాల్సిందే.ఇదిలాఉండగా.. ఎరాస్మస్ సేన ఎలాగైనా కివీస్ పై పోరాడి విజయం  సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !