క్రికెటర్ పై జాత్యాహంకార వ్యాఖ్యలు.. యార్క్ షైర్ పై నిషేధం విధించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..

By team teluguFirst Published Nov 5, 2021, 4:41 PM IST
Highlights

Yorkshire: యార్క్ షైర్ తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ అజీమ్ రఫీక్ ఈ ఆరోపణలు చేశాడు. 2018లో ఓ మ్యాచ్ సందర్భంగా తన సహచరులు, కోచ్ కలిసి తనపై జాత్యహంకార  వ్యాఖ్యలు చేశారని యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ) కు ఫిర్యాదు చేశాడు.

ఇంగ్లాండ్ లో ప్రముఖ క్రికెట్ క్లబ్ గా పేరు గాంచిన యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ పై ఆ దేశ జాతీయ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది.  జాత్యహంకార ఆరోపణల నేపథ్యంలో యార్క్ షైర్ పై నిషేధం విధిస్తున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండేండ్ల క్రితం అమెరికాలో మొదలై ప్రపంచమంతా పాకిన బ్లాక్ లివ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) సందర్భంగా.. పాక్ మూలాలున్న ఓ ఇంగ్లాండ్ క్రికెటర్ పై మరో తెల్లజాతి క్రికెటర్ రేసిజం వ్యాఖ్యలు చేసినందుకు గాను యార్క్ షైర్ ఈ నిషేధాన్ని ఎదుర్కొంది. 

వివరాల్లోకెళ్తే.. యార్క్ షైర్ తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ అజీమ్ రఫీక్ ఈ ఆరోపణలు చేశాడు. 2018లో ఓ మ్యాచ్ సందర్భంగా తన సహచరులు, కోచ్ కలిసి తనపై జాత్యహంకార  వ్యాఖ్యలు చేశారని యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ) కు ఫిర్యాదు చేశాడు. సరదా పేరు చెప్పి తనను దూషించే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

దీనిపై సమగ్ర విచారణ జరిపించిన ఈసీబీ..  ఈ విషయంలో వైసీసీసీ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ‘ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అని నివేదికలో పేర్కొంది. ఇలాంటివి క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. వైసీసీసీ వైఖరిని ఖండిస్తూ.. ఆ కౌంటీ క్లబ్ పై నిషేధం విధించింది. అంతేగాక.. యార్క్ షైర్ గ్రౌండ్ లో మ్యాచులను కూడా నిర్వహించొద్దని తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలు పాటించినప్పుడు మాత్రమే  నిషేధం తొలిగిస్తామని  ఈసీబీ తెలిపింది. 

 

ECB Board statement on Yorkshire County Cricket Club

— England and Wales Cricket Board (@ECB_cricket)

‘అజీమ్ రఫీక్ లేవనెత్తిన సమస్యలపై వైసీసీసీ వ్యవహరించిన తీరు పూర్తిగా ఆమోదయోగ్యం కానిది. అంతేగాక ఇది  ఆట ప్రతిష్టకూ తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది. ఈసీబీ ఈ విషయాన్ని అసహ్యకరమైనదిగా.. క్రికెట్ స్పూర్తికి, దాని విలువలకు పూర్తిగా విరుద్ధమైనదిగా గుర్తించింది’ అని పేర్కొంది. ‘ఆట నిజంగా ప్రతి ఒక్కరికీ ఆటగా ఉండాలనే దాని నిబద్ధతను ప్రదర్శించాలంటే ఈ విషయాన్ని పటిష్టంగా పరిష్కరించాలి..’ అని  సున్నితంగా మందలించింది. 

‘ఇటీవలి కొన్ని ఘటనల ప్రకారం.. వైసీసీసీ పాలన, నిర్వహణకు సంబంధించి తీవ్ర ప్రశ్నలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. వారి స్వంత నివేదికకు సంబంధించిన చర్యలు, ప్రతిస్పందనలకు సంబంధించి క్లబ్ వైఫల్యం, ఆట పట్ల దాని ఉల్లంఘనను గణనీయంగా సూచిస్తున్నది’ అంటూ ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. అంతేగాకజ యార్క్ షైర్ గవర్నెన్స్ ను పూర్తి స్థాయిలో సమీక్షించవలసిందిగా ఈసీబీ ఎగ్జిక్యూటివ్ ను కోరింది. 

యార్క్ షైర్ కు చెందిన అజీమ్ రఫీక్ సహచరుడు  గ్యారీ బ్యాలెన్స్.. అతడిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో అతడిని కూడా సస్పెండ్ చేసినట్టు సమాచారం. 

click me!