
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) కంటే భారత జట్టు సారథి విరాట్ కోహ్లి (Virat Kohli)కి దూకుడెక్కువని నమీబియా (Namibia) ఆల్ రౌండర్ డేవిడ్ వీస్ (David Wiese) అన్నాడు. అతడి (విరాట్) తో ఆడటం తనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు. కోహ్లి మెరుగైన ఆటగాడని, ప్రపంచంలో ఏ బౌలర్ నైనా ఎదుర్కోవడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. రెండేండ్ల క్రితం టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) నకు నమీబియా కు అర్హత సాధించడం నుంచి ఇప్పటిదాకా సాగిన ఆ జట్టు ప్రయాణం డేవిడ్ వీస్ మాటల్లోనే..
నమీబియాకు ఆడకముందు వీస్.. దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు. 2003 ప్రపంచకప్ లో అతడు ప్రొటీస్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2013-16 మధ్య కాలంలో కూడా ఆ జట్టుకు ఆడాడు. కానీ ఆ తర్వాత పలు కారణాల రీత్యా వీస్ కుటుంబం నమీబియాకు తరలివెళ్లింది. దీంతో అతడు అప్పట్నుంచి నమీబియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘నేను అప్పుడు చాలా చిన్నవాడిని. స్కూల్ అయిపోయిన సమయం. దక్షిణాఫ్రికా జట్టులో జూనియర్ ను. కానీ ఇప్పుడు నేను నమీబియా తరఫున ఆడుతున్నాను. దానిని దీనిని పోల్చలేం. అప్పటి జ్ఞాపకాలు నాకింకా గుర్తున్నాయి. ముఖ్యంగా 2003 ప్రపంచకప్ లో మేము (దక్షిణాఫ్రికా).. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో (శ్రీలంక చేతిలో) మా ప్రయాణాన్ని ముగించాం. అది నాకు చాలా బాధగా అనిపించింది’ అని అన్నాడు.
ఇక ఐపీఎల్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా వీస్ కొంతకాలం ఆడాడు. దీనిపై మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి, ఆర్సీబీకి ఆడటం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆటకు ముందు విరాట్ చాలా కష్టపడుతాడు. గేమ్ లో రాణించడానికి అతడు పడే హార్డ్ వర్క్, ట్రైనింగ్, డెడికేషన్ నన్ను మంత్రముగ్దున్ని చేశాయి. సారథ్య బాధ్యతలు పక్కనబెడితే క్రికెట్ పట్ల అతడికి ఉండే ప్యాషన్ చూస్తే మాత్రం ఎవరైనా ఫిదా కావాల్సిందే’ అని చెప్పాడు.
ఈ మెగా టోర్నీలో నమీబియా.. భారత్, పాకిస్థాన్ లతో తలపడబోతున్నది. దీని గురించి వీస్ స్పందిస్తూ.. ‘సూపర్-12 స్టేజ్ లో మేము భారత్, పాక్ తో తలపడాల్సి ఉంది. విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్ ఇద్దరూ గొప్ప బ్యాట్స్మెనే. టీ20 క్రికెట్ లో బాబర్ చాలా నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించి తర్వాత పాక్ బ్యాటింగ్ భారన్నంతా మోస్తాడు. విరాట్ కూడా చాలా మెరుగైన ఆటగాడు.ప్రపంచంలో మేటి బ్యాటర్లలో అతడు ఒకడు. ఇక బాబర్ కంటే కోహ్లి దూకుడుగా ఉంటాడు. ప్రపంచంలోని ఏ బౌలర్ నైనా ఎదుర్కోవడంలో బాబర్ కంటే అగ్రెసివ్ గా ఉంటాడు. నా దృష్టిలో వాళ్లిద్దరినీ పోల్చడం చాలా కష్టం’ అని తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీకంటే ముందు అతడు.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. దీంతో అతడికి యూఏఈ పిచ్ ల మీద కూడా అవగాహన ఏర్పడింది. గతానుభవంతోనే ప్రస్తుతం ఈ పిచ్ ల మీద మెరుగ్గా ఆడగలుగుతున్నానని వీస్ చెప్పుకొచ్చాడు. స్థానిక పరిస్థితులు, పిచ్ ల మీద అవగాహన ఉంటే అది ఇలాంటి టోర్నీలప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు.
ఇక ఈ టోర్నీలో నమీబియా తరఫున అదరగొడుతున్న వీస్.. నమీబియా బ్యాటింగ్ లైనప్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు అతడు 116 పరుగులు చేశాడు. అంతేగాక బౌలింగ్ లో నాలుగు వికెట్లు కూడా తీశాడు. అంతకుముందు క్వాలిఫై రౌండ్లలో నమీబియా.. సూపర్-12కు అర్హత సాధించడంలో వీస్ కీలక పాత్ర పోషించాడు. కాగా, ఈనెల 8న నమీబియా.. భారత్ తో తలపడనున్న విషయం తెలిసిందే.