T20 World cup: అనూహ్యం.. అద్భుతాలు.. అసాధ్యాలపై ఆధారపడ్డ టీమిండియా.. మనమింకా సెమీస్ రేసులో ఉన్నామా..?

By team teluguFirst Published Nov 1, 2021, 11:39 AM IST
Highlights

SemiFinal Options For India: ఫైనల్ అయితే పక్కా.. కప్పు కొడుతుందో లేదో చూడాలి...! ఇవీ నిన్నటి దాకా టీమిండియా, భారత ఆటగాళ్లపై ఫ్యాన్స్ అంచనాలివి. కానీ రెండు మ్యాచ్ లు. టీమిండియా గమనాన్ని, గమ్యాన్ని మార్చివేశాయి. రెండంటే రెండు మ్యాచ్ లు మనం ఎక్కడున్నామో చెప్పకనే చెప్పాయి.

ప్రపంచంలోని మేటి జట్టు.. మేటి బౌలర్లను తుత్తునీయలు చేసే బ్యాటింగ్ లైనప్.. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లను కూడా గడగడలాడించే బౌలింగ్ దళం.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఈ సారి ప్రపంచకప్ లో హాట్  ఫేవరేట్.. విరాట్ కోహ్లి (Virat kohli) కు కెప్టెన్ గా చివరి టోర్నీ, మెంటార్ గా ధోని (MS Dhoni).. ఇంకేంటి భారత్ (India) కు తిరుగేలేదు.. ఫైనల్ అయితే పక్కా.. కప్పు కొడుతుందో లేదో చూడాలి...! ఇవీ నిన్నటి దాకా టీమిండియా (Team India), భారత ఆటగాళ్లపై ఫ్యాన్స్ కామెంట్స్. కానీ రెండు మ్యాచ్ లు. టీమిండియా గమనాన్ని, గమ్యాన్ని మార్చివేశాయి. రెండంటే  రెండు మ్యాచ్ లు మనం ఎక్కడున్నామో చెప్పకనే చెప్పాయి.  సూపర్-12లో టాప్ లో ఉండి  ఫైనల్ బెర్త్ ఖాయమనుకున్న జట్టు.. ఇప్పుడు ఇతర జట్ల విజయాలు, అపజయాల మీద ఆధారపడాల్సిన  దౌర్భాగ్యం ఎదురైంది. 

ఈనెల 24న  పాక్ (Pakistan) తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత సారథి విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘ఇదే మా తొలి మ్యాచ్. ఇప్పుడే ప్రపంచకప్ ప్రయాణం  ఆరంభించాం. మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని ఓటమిని సమర్థించుకుంటూ మాట్లాడాడు. కానీ సరిగ్గా  వారం రోజల తర్వాత.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఓడిపోయాక మాట్లాడుతూ.. ‘చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్ తో కానీ బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. కనీసం  పోరాడలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్ లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం..’ అని వ్యాఖ్యానించాడు. తేడా అర్థమవుతోంది కదా... ! టోర్నీ నుంచి భారత్ దాదాపు నిష్క్రమించినట్టే. ఒక్క సాంకేతికంగా తప్ప.. 

అదెలాగంటే...!

టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాక్, అఫ్గాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో న్యూజిలాండ్ (Newzealand)ఉంది. భారత్ కు ఇంకా మూడు మ్యాచులున్నాయి. అందులో  తర్వాత మ్యాచ్ అఫ్గానిస్థాన్ (Afghanistan) తో.  ఆ మ్యాచే భారత్ కు ఇప్పుడు కీలకం. అఫ్గనిస్థాన్ తో పాటు నమీబియా, స్కాట్లాండ్ ను కూడా భారత్ భారీ తేడాతో ఓడించాలి.  ఒకరకంగా చెప్పాలంటే భారత్ ఏకపక్ష విజయాలు సాధించాలి.  అయితే ఈ విజయాలతో టీమిండియా సెమీస్ కు వెళ్లదు.. కానీ మన రన్ రేట్ మెరుగుపడుతుంది.  3 మ్యాచులలో గెలిస్తే టీమిండియాకు ఆరు పాయింట్లు దక్కుతాయి. మైనస్ లో ఉన్న రన్ రేట్ మెరుగవుతుంది. 

ఇదీ చదవండి: T20 Worldcup:ఏంటి ఫోర్లు కొట్టడం మరిచారా..? బౌండరీ రావడానికి 70 బంతులా..? టీమిండియా చెత్త ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం

ఇక అద్భుతమేంటంటే.. :  మనతో పాటే ప్రపంచకప్ ప్రయాణం ప్రారంభించిన కివీస్.. అప్గానిస్థాన్ చేతిలో ఓడిపోవాలి. కివీస్ వాళ్ల చేతిలో ఓడిపోతే మనకు సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే. కానీ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు, భీకరమైన బౌలింగ్ దాడి ఉన్న భారత్ నే  ఆ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. అలాంటి జట్టుపై సంచలనాల అఫ్గాన్.. మరో సంచలనం సృష్టించడం అత్యాశే అవుతుంది. అయితే.. ఒక వేళ అఫ్గాన్ మాత్రం కివీస్ ను ఓడించి.. భారత్ మిగిలిన 3 మ్యాచులలో అతి భారీ తేడాతో గెలిస్తే మనకు సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే.. 

గాలికి దీపం పెట్టి చూడటమే..

అయితే టైటిల్ ఫేవరేట్ గా ఉన్న జట్టు.. రెండు మ్యాచులతోనే తలకిందులైంది.  ఫైనల్ బెర్త్ ఖాయమనుకున్న అభిమానులు.. ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడటాన్ని చూసి.. ‘ఏం హాలత్ అయిపోయిందిరా బై..’ అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మన విజయాల గురించి పక్కనబెట్టి కివీస్ ఓటములు గురించి ఆలోచిద్దాం.  అలాగైనా ఈ వేదనను దూరం చేసుకుందాం.. అనుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి టీమిండియా సెమీస్ కు వెళ్తుందా..? లేక నవంబర్ 9న నమీబియా తో మ్యాచ్ ముగిశాక ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతుందా..? చూడాలంటే కాలం పెట్టే పరీక్షలను భరించాలి మరి. ఇప్పటికైతే టీమిండియా చేయగలిగిందింతే.. 

click me!