No Ball: కొంపముంచిన నోబాల్.. అప్పుడు బుమ్రా ఇప్పుడు దీప్తి.. అదే కథ, తీరని వ్యథ

Published : Mar 27, 2022, 03:16 PM IST
No Ball: కొంపముంచిన నోబాల్.. అప్పుడు బుమ్రా ఇప్పుడు దీప్తి.. అదే కథ,  తీరని వ్యథ

సారాంశం

ICC Women's World Cup 2022: మ్యాచులో ఎంత బాగా ఆడినా క్రికెటర్లు చేసే చిన్న తప్పులే ఒక్కోసారి మ్యాచ్ గతిని మార్చేస్తాయి. ద్వైపాక్షిక సిరీస్ లలో అయితే వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పన్లేదు. కానీ ఐసీసీ టోర్నీలలో అయితే భారీ మూల్యం చెల్లించాల్సిందే.  టీమిండియా చెల్లించింది కూడా... 

ఐసీసీ టోర్నీలలో భారత క్రికెట్ జట్టును నో బాల్ వేధిస్తున్నది.  న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా  ఆఖరి ఓవర్  వేసిన దీప్తి శర్మ.. 49.5 బంతిని నోబాల్ గా విసిరింది. మ్యాచులో ఇదే టర్నింగ్ పాయింట్. ఫలితంగా దక్షిణాఫ్రికాకు అదనపు పరుగు రావడమే గాక మ్యాచ్ కూడా చేజారింది. టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. అయితే ఇలా నో బాల్ ద్వారా భారత్ ఐసీసీ టోర్నీలలో వైదొలగడం ఇదే తొలిసారి కాదు. గతంలో  బుమ్రా కూడా దీనికి బాధితుడే. రెండు సార్లు  అదే కథ.. అదే వ్యథ. 

అది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియా -పాకిస్థాన్ మధ్య ఫైనల్.  ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా జరిగిన ఆ మ్యాచులో టాస్ గెలిచిన  విరాట్ సేన.. బౌలింగ్ ఎంచుకుంది.  పాకిస్థాన్ బ్యాటింగ్ కు వచ్చింది.  

 

పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్  బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు 3 పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్ చేశాడు. బుమ్రా వేసిన బంతి.. జమాన్  బ్యాట్ ను ముద్దాడి  వికెట్ కీపర్ ధోని చేతిలో పడింది. జమాన్ క్రీజు ను వీడాడు. అయితే అంపైర్ నో బాల్ చెక్ చేశాడు. అంపైర్ ఊహించినట్టుగానే అది నోబాల్.  అంతే అందివచ్చిన అవకాశాన్ని జమాన్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.  భారీ లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 30 ఓవర్లలో 158 పరుగులకే నిష్క్రమించింది. పాక్  180 పరుగుల తేడాతో గెలిచింది. 

కట్ చేస్తే.. 2022 మహిళల ప్రపంచకప్. ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా కూడా ధీటుగానే జవాబిచ్చింది.  మ్యాచ్ ఫలితం తేలింది ఆఖర్లోనే. 

 

ఆఖరి ఓవర్ దీప్తి శర్మ వేసింది.  6 బంతుల్లో 7 పరుగులు చేయాలి. ఇది సమీకరణం. రెండో బంతికే దక్షిణాఫ్రికాకు చెందిన త్రిషా చట్టీ రనౌట్ అయింది. చివరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాలి.  అయితే ఐదో బంతి విసిరిన దీప్తి శర్మ.. ఓవర్ స్టెప్  అవడంతో అంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించింది. ఒక్కో పరుగు తీయడానికి కష్టపడుతున్న సఫారీలకు  అదనంగా పరుగు కలిసొచ్చింది. అప్పటికే మ్యాచ్ డ్రా. తర్వాత బంతికే సింగిల్ తీసిన దక్షిణాఫ్రికా.. విజయం సాధించింది. భారత్ ఆశలు అడుగంటాయి.   ఒక్క నోబాల్  అప్పుడు భారత్ కు  ఛాంపియన్స్ ట్రోఫీని దూరం చేయగా ఇప్పుడు దీప్తి శర్మ వేసిన నో బాల్.. మహిళల ప్రపంచకప్ లో భారత్  ప్రస్థానాన్ని ముగించింది.  

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?