Women's World Cup: బ్యాటర్లు సూపర్.. సఫారీలపై ఒత్తిడి పెంచుతున్న బౌలర్లు.. మిథాలీ సేన సెమీస్ చేరేనా..?

Published : Mar 27, 2022, 12:33 PM ISTUpdated : Mar 27, 2022, 12:39 PM IST
Women's World Cup: బ్యాటర్లు సూపర్.. సఫారీలపై ఒత్తిడి పెంచుతున్న బౌలర్లు.. మిథాలీ సేన సెమీస్ చేరేనా..?

సారాంశం

CWC 2022: తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు  అర్థ సెంచరీలకు తోడు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా  మెరుగ్గా ఆడటంతో భారత్.. దక్షిణాఫ్రికా ముందు పోరాడే లక్ష్యాన్ని నిలపగలిగింది. 

మహిళల ప్రపంచకప్ లో తప్పక నెగ్గాల్సిన మ్యాచులో  మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లు సమిష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికాపై పోరాడే లక్ష్యాన్ని నిలుపగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా.. 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా ధీటుగా ఆడుతున్నది. ఆదిలోనే ఆ జట్టు వికెట్ నష్టపోయినా తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు విజయం దిశగా  పరుగులు తీస్తుంది. ఈ మ్యాచులో గెలిస్తేనే భారత జట్టు సెమీస్ చేరుతుంది. దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే. 

న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తప్పక నెగ్గాల్సిన మ్యాచులో భారత ఓపెనర్లు  స్మృతి మంధాన (84 బంతుల్లో 71), షఫాలీ వర్మ (46 బంతుల్లో 53) లు ధాటిగా ఆడారు.  ఓపెనర్లిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత జట్టు స్కోరు ఆది నుంచే పరుగులు పెట్టింది. మంధాన, షఫాలీ ఇద్దరూ సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. 

అయితే హాఫ్ సెంచరీ చేసుకున్నాక షఫాలీ.. రనౌట్ అయింది. దీంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ వెంటనే వచ్చిన యస్తిక భాటియా (2) కూడా త్వరగానే నిష్క్రమించింది. అయితే భాటియా స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (84 బంతుల్లో 68) పట్టుదలగా ఆడింది. మంధానతో కలిసి ఆమె భారత స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. 

 

ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 70 పరుగులు జోడించారు. అయితే మసబట క్లాస్  వేసిన 31వ ఓవర్లో మంధాన ట్రైయాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.  ఆ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ (57 బంతుల్లో 48) తో జతకలిసిన మిథాలీ.. నాలుగో వికెట్ కు ఆమెతో కలిసి 58 పరుగులు జోడించింది. ఇక చివర్లో  స్కోరు బోర్డును పెంచే క్రమంలో ఈ ఇద్దరూ వెనువెంటనే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన పూజా వస్ర్తకార్ (3), రిచా ఘోష్ (8) లు కూడా  బ్యాట్ ఝుళిపించలేకపోయారు.

నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా.. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా  ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ లిజెల్లి లీ (6) ని హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత త్రో తో రనౌట్ చేసింది. అయితే ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లారా (49) తో కలిసి లారా వోల్వార్డ్ట్ (80) భారత్ ను భయపెట్టింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 125 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడిని స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ విడదీసింది. ఆమె వేసిన 26.5 వ ఓవర్లో లారాను కీపర్ రిచా ఘోష్ స్టంపౌట్ చేసింది. కొద్దిసేపటికే వొల్వార్డ్ట్ ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా.. 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ట నష్టానికి 156 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టుకు ఇంకా 20 ఓవర్లలో 119 పరుగులు కావాలి. భారత్ కు ఏడు వికెట్లు కావాలి. మరి విజయం ఎవరిని వరించుతుందో..?  

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?