Women's World Cup: టీమిండియా గుండె పగిలిన క్షణం..! టోర్నీ నుంచి నిష్క్రమించిన మిథాలీ సేన..

Published : Mar 27, 2022, 02:30 PM ISTUpdated : Mar 27, 2022, 02:32 PM IST
Women's World Cup: టీమిండియా గుండె పగిలిన క్షణం..! టోర్నీ నుంచి నిష్క్రమించిన మిథాలీ సేన..

సారాంశం

Women's World Cup 2022: మహిళల ప్రపంచకప్ లో భారత్ ప్రస్థానం ముగిసింది. ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ కు వెళ్లిన  మిథాలీ సేన.. దక్షిణాఫ్రికాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచులో తుది కంటా పోరాడి ఓడింది.  ఆఖర్లో హైడ్రామా నడిచిన ఈ మ్యాచులో... 

భారీ ఆశలతో వన్డే ప్రపంచకప్ వేట ప్రారంభించిన భారత జట్టుకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. తప్పక గెలవాల్సిన మ్యాచులో  మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా.. దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడింది. బ్యాటింగ్ లో రాణించి, ఆఖర్లో బౌలింగ్ లో కూడా పుంజుకున్నా.. దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్లు మెరుగ్గా రాణించి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో మ్యాచ్ చేజారింది. బ్యాటింగ్ లో రాణించి ఫీల్డింగ్ లో నాలుగు రనౌట్లు చేసి.. బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసినా భారత జట్టుకు ఓటమి తప్పలేదు.  ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం ఆఖరికి దక్షిణాఫ్రికానే వరించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్  మిగ్నోన్ డు ప్రెజ్ కు ప్లేయర్ ఆఫ్ ది  మ్యాచ్ అవార్డు దక్కింది. 

తొలుత భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విన్నింగ్ రన్ (275) కొట్టింది.  ఇక ఈ ఓటమితో  ప్రపంచకప్ లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది.  పాయింట్ల పట్టికలో  భారత్ కంటే ఒక పాయింట్ ఎక్కువగా ఉన్న విండీస్ సెమీస్ కు చేరింది. పాయింట్ల పట్టికలో  ఏడింటికి ఏడు గెలిచి ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లు తదుపరి స్థానంలో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు సెమీస్ ఆడతాయి. 

 

న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మ్యాచులో  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68) లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరికి తోడు హర్మన్ ప్రీత్ కౌర్ (48) కూడా రాణించింది. ఫలితంగా  నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా.. 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.  

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ లిజెల్లి లీ (6) ని హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ చేసింది. ఆమె స్థానంలో  బ్యాటింగ్ కు వచ్చిన  లారా (49) తో కలిసి లారా వోల్వార్డ్ట్ (80) భారత్ ను భయపెట్టింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 125 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడిని స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ విడదీసింది. ఆమె వేసిన 26.5 వ ఓవర్లో లారాను కీపర్ రిచా ఘోష్ స్టంపౌట్ చేసింది. అదే మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. 

లారా ప్టంపౌట్ అయిన కొద్దిసేపటికే వొల్వార్డ్ట్ ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌల్డ్ చేసింది. అందివచ్చిన అవకాశాన్ని భారత బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.   సఫారీ బ్యాటర్లను నిలువరించారు. కెప్టెన్ సునె లూస్ (22) ను హర్మన్ ప్రీత్ ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపింది. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 36.1 ఓవర్లలో 4 వికెట్ట నష్టానికి 182 పరుగులు. 

ఈ క్రమంలో మిగ్నోన్ డు ప్రెజ్ (52 నాటౌట్) తో కలిసి మరిజన్నె కాప్ (32)   కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 47 పరుగులు జోడించారు.  ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడిని 44 వ ఓవర్లో హర్మన్ ప్రీత్ విడదీసింది. అద్భుత  త్రోతో ఆమె.. కాప్ ను రనైట్ చేసింది. ఆ తర్వాత ఆమె త్రిషా చెట్టీ ను  కూడా రనౌట్  చేయడం విశేషం.

 

ఆఖరి ఓవర్లో  హై డ్రామా.. 

ఆఖరు ఓవర్లో 7 పరుగులు అవసరమనగా మ్యాచులో డ్రామా మొదలైంది. దీప్తి శర్మ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి త్రిషా చెట్టీ రన్ తీసింది. రెండో బంతికి  ఆమెను హర్మన్ ప్రీత్ రనౌట్ చేసింది. కానీ అప్పటికే ఒక పరుగు వచ్చింది. దీంతో సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులు. మూడో బంతికి ప్రెజ్ మరో పరుగు తీసింది. రెండు బంతుల్లో 3 పరుగులు కావాలి. ఐదో బంతిని దీప్తి శర్మ నోబాల్ గా విసిరింది. దీంతో దక్షిణాఫ్రికాకు అదనంగా ఒక పరుగు వచ్చింది.  ఐదో బంతికి మళ్లీ ఒక పరుగు. స్కోరు సమమైంది. ఇక చివరి బంతికి క్రీజులో ఉన్న ప్రెజ్.. పరుగు తీసి విజయాన్ని అందుకుంది.  అంతే భారత్ గుండె పగిలింది. హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుత పోరాటం,  ముగ్గురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి.  ఈ ఓటమితో భారత్ మహిళల ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.  

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు