రోోహిత్ లా సెంచరీ, కోహ్లీలా హాఫ్ సెంచరీ చేయలేదు... కానీ ఒకే ఒక్క భారీ సిక్సర్ తో క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యారు.
న్యూడిల్లీ : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఆస్ట్రేలియాతో ఆడిన తొలిమ్యాచ్ లో విఫలమైన ఓపెనర్లు అప్ఘానిస్తాన్ పై చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ (131 పరుగులు 84 బంతుల్లో), రన్ మెషిన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో (55 పరుగులు 47 బంతుల్లో) అభిమానులను అలరించారు. కానీ శ్రేయాస్ అయ్యర్ పెద్దగా పరుగులు చేయకున్నా కేవలం ఒకే ఒక్క సిక్సర్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు. ఏకంగా 101 మీటర్ల భారీ సిక్స్ బాదిన శ్రేయాస్ తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. ఇలా స్టార్ క్రికెటర్లు సెంచరీ, హాఫ్ సెంచరీతో చెలరేగిన మ్యాచ్ కేవలం ఒకేఒక కళ్లుచెదిరే సిక్సర్ తో అభిమానుల చూపు తనవైపు తిప్పుకున్నాడు ఈ యువ క్రికెటర్.
న్యూడిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా-ఆప్ఘానిస్తాన్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మొదటి మ్యాచ్ లో ఆసిస్ బ్యాటర్లను అల్లాడించిన భారత బౌలర్ల ముందు పసికూన అప్ఘాన్ తేలిపోతుందని అందరూ భావించారు. కానీ అప్ఘాన్ బ్యాటర్లు తమతో అంత ఈజీ కాదని నిరూపించారు. టీమిండియా బౌలర్లను ధీటుగానే ఎదుర్కొని గౌరవప్రదమైన 272 పరుగులు చేసారు. షాహిది 80 పరుగులు, అజ్మతుల్లా 62 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
undefined
ఇక 273 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా అప్ఘాన్ బౌలర్లతో ఓ ఆటాడుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేసాడు. అతడికి ఇషాన్ కిషన్ (47 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. అయితే విజయానికి బాటలువేసిన ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరిన కీలక సమయంలో శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ క్రీజులోకి ఎంటరయ్యారు. వీరిద్దరూ కలిసి సంయమనంతో ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
అయితే అప్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన 32వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్సర్ బాదాడు. ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో ఎగిరి బంతి అమాంతం అభిమానుల మధ్యలో పడింది. ఇలా శ్రేయాస్ కేవలం ఒకేఒక సిక్సర్ తో అభిమానుల మనసులు దోచుకున్నాడు.