ICC World cup 2023: ఆఫ్ఘాన్‌పై టీమిండియా ఘన విజయం... వరుసగా రెండో విజయంతో...

By Chinthakindhi Ramu  |  First Published Oct 11, 2023, 9:03 PM IST

ఆఫ్ఘాన్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... భారీ సెంచరీ చేసిన రోహిత్ శర్మ! విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. 47 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. ఆఫ్ఘాన్‌కి ఇది వరుసగా రెండో ఓటమి.

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి తొలి వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 63 బంతుల్లో సెంచరీ బాదిన రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 7 సెంచరీలు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ..  
 
47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగులు జోడించారు. 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

Latest Videos

ఛేదనలో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు 1996లో సచిన్ టెండూల్కర్ 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్‌లో 28 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, 27 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించేశాడు..

 56 బంతుల్లో 6 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. శ్రేయాస్ అయ్యర్ 23 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. 


ఫజల్ హక్ ఫరూకీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు సమం చేశాడు రోహిత్ శర్మ...

టీమిండియాతో మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో 1000 పరుగులు అందుకుని, సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 22 పరుగులు చేసి ఉంటే, వార్నర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యేది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ కావడంతో వార్నర్ రికార్డు సమం మాత్రమే అయ్యింది..

ఫజల్ హక్ ఫరూకీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 4,4,2,6 బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ ఓవర్‌లో 4, 6 బాది.. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదగా, రోహిత్ శర్మ 555 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు..
 

click me!