63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ... వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తరుపున ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, పసికూన ఆఫ్ఘాన్‌పై సెంచరీతో చెలరేగాడు. మొదటి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్న ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా మరో ఎండ్‌లో ‘హిట్ మ్యాన్’ బౌండరీలతో ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు..
63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అలాగే గత వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు బాదిన రోహిత్‌కి ఇది ఓవరాల్‌గా ఏడో వరల్డ్ కప్ సెంచరీ. ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ..
మరో ఎండ్‌లో మొదటి 25 బంతుల్లో 14 పరుగులే చేసిన ఇషాన్ కిషన్, 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 18 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కి 154 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఫజల్ హక్ ఫరూకీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు సమం చేశాడు రోహిత్ శర్మ...
టీమిండియాతో మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో 1000 పరుగులు అందుకుని, సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 22 పరుగులు చేసి ఉంటే, వార్నర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యేది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ కావడంతో వార్నర్ రికార్డు సమం మాత్రమే అయ్యింది..
టీమిండియా తరుపున వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ 2278 వన్డే వరల్డ్ కప్ పరుగులతో టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ 1115 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 1006 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీని కూడా దాటేశాడు రోహిత్ శర్మ..
ఫజల్ హక్ ఫరూకీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 4,4,2,6 బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ ఓవర్‌లో 4, 6 బాది.. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదగా, రోహిత్ శర్మ 555 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు..
30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలోపు హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 2003లో పాకిస్తాన్‌పై సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించాడు. 20 ఏళ్ల తర్వాత రోహిత్ ఆ ఫీట్‌ని రీపీట్ చేశాడు..