2028 ఒలింపిక్స్ లో క్రికెట్... బీసీసీఐ అండతో ఐసీసీ ముమ్మర ప్రయత్నం

By team teluguFirst Published Aug 10, 2021, 4:04 PM IST
Highlights

ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న ఐసీసీ... తాజాగా ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి 2028 లాస్ ఏంజెలెస్ సమ్మర్ ఒలింపిక్స్ లో భాగం చేసేలా ఐఓసీ ని ఒప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. 

2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ని ప్రవేశపెట్టేందుకు తాము బిడ్ చేయబోతున్నట్టు ఐసీసీ మరోమారు వెల్లడించింది. ఒలింపిక్స్ లో క్రికెట్ ని ప్రవేశపెట్టేందుకు ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న ఐసీసీ మరోమారు తాము బిడ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ బిడ్ కి ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ పూర్తిస్థాయిలో మద్దతిస్తుందని ఇప్పటికే జయ్ షా ప్రకటించిన విషయం తెలిసిందే..!

తమ అటానమి ని ఎక్కడ కోల్పోతేమోనన్న భయంతో ఐసీసీ ఇంతకు మునుపు ఐఓసీ ముందు ఈ ప్రతిపాదన పెట్టేందుకు ఐసీసీ అంత ఆసక్తిని చూపలేదు. ఎప్పుడైతే జయ్ షా మద్దతు తెలిపాడో... ఒకవేళ క్రికెట్ గనుక భాగమైతే భారత్ పాల్గొంటుందని మాట ఇచ్చాడో ఐసీసీ మరోమారు సమ్మర్ ఒలింపిక్స్ లో క్రికెట్ ని భాగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలను మొదలుపెట్టింది. 

ఐసీసీ ఇప్పటికే ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ ను ఒకదాన్ని 2028లో ఒలింపిక్స్ లో క్రికెట్ ని ప్రవేశపెట్టించేందుకు చేయాల్సిన ప్రయత్నాల కోసం నియమించింది కూడా. క్రికెట్ భవిష్యత్తు దృష్ట్యా ఒలింపిక్స్ లో క్రికెట్ చేరిక అవసరమని, అంతే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మందికి పైగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో కనీసం 90 శాతం మంది ఒలింపిక్స్ లో క్రికెట్ భాగస్వామ్యం అయితే చూడాలని కోరుకుంటున్నారని ఐసీసీ అధికారి ఒకరు అన్నారు. 

దక్షిణాసియాలో ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని, అమెరికాలో కూడా కనీసం 30 మిలియన్ మంది క్రికెట్ ప్రేమికులున్నారని.... వీరంతా ఒలింపిక్స్ లో క్రికెట్ ఆటను చూడడానికి ఇష్టపడుతున్నారని ఆయన తెలిపారు. 1998 తరువాత తొలిసారి బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ ద్వారా క్రికెట్ రీఎంట్రీ ఇస్తుంది. 

కఠినమైన కోవిడ్ పరిస్థితుల మధ్య నిబంధనలతో సజావుగా టోక్యో ఒలింపిక్స్ ని నిర్వహించిన నిర్వాహకులకు ఐసీసీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తలిపింది. మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జపాన్ ప్రజలు, ప్రభుత్వం ఎంతో ధృడ సంకల్పంతో ఒలింపిక్స్ ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఐసీసీ తెలిపింది. 

క్రికెట్ గనుక ఒలింపిక్ క్రీడల్లో భాగమైతే చాలా బాగుంటుందని, కానీ మరెన్నో క్రీడలు కూడా ఒలింపిక్స్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ... క్రికెట్ ను చేర్చడం అంత తేలికైన విషయం కాదని తమకు తెలుసునని,అయినప్పటికీ... తాము ప్రయత్నాలను సాగిస్తామని ఐసీసీ తెలిపింది. 

అధికారిక వెబ్ సైట్ ప్రకారం 2028లో ఉండే ఒలింపిక్ క్రీడలను 2024లో వెల్లడిస్తామని పేర్కొంది ఐఓసీ. ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ లో అమెరికా క్రికెట్ బోర్డు కూడా భాగస్వాములుగా ఉండడం, వారు సైతం క్రికెట్ ని ఒలింపిక్స్ లో చేర్చేందుకు ఆసక్తిని చూపెట్టడం ఇక్కడ ఒకింత కలిసొచ్చే అంశం. 

2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేరిస్తే క్రికెట్ గ్లోబల్ స్పోర్ట్ గా మరింత ముందుకెళ్లడమే కాకుండా... అమెరికాలో క్రికెట్ ని ఒక మెయిన్ స్ట్రీమ్ ఆటగా ప్రమోట్ చేసే వీలవుతుందని అమెరికా క్రికెట్ సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. 

click me!